‘స్టార్' తిరుగుతోంది | 'Star' turning | Sakshi
Sakshi News home page

‘స్టార్' తిరుగుతోంది

Published Sat, Nov 15 2014 1:34 AM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM

‘స్టార్' తిరుగుతోంది

‘స్టార్' తిరుగుతోంది

ఆతిథ్య రంగం ‘స్టార్'తిరుగుతోంది. గుంటూరు జిల్లాలో నవ్యాంధ్ర రాజధాని ఏర్పాటు కానుండటంతో ఈ ప్రాంతంపై ఆతిథ్య రంగ దిగ్గజాలు దృష్టి సారించారు. గుంటూరు, విజయవాడల్లో అధునాతన వసతులతో ఐదు, ఏడు నక్షత్రాల హోటళ్ల ఏర్పాటుకు కసరత్తును ముమ్మరం చేశారు. కొన్ని సంస్థలు ఇప్పటికే స్థలాలు కొనగోలు చేశాయి.

మరికొన్ని రామవరప్పాడు నుంచి మంగళగిరి మధ్య తమ బ్రాంచ్‌ల ఏర్పాటుకు స్థలాలను అన్వేషిస్తున్నాయి. ఈ క్రమంలో ఆతిథ్య రంగంలో ఆదాయం పెరగడంతోపాటు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.  

 
 లబ్బీపేట: ఆతిథ్య రంగ దిగ్గజాలు ఐటీసీ.. మారియేట్.. నోవాటెల్.. గ్రీన్‌పార్క్.. కీస్(కేఈవైఎస్) వంటి అనేక స్టార్ హోటళ్లు నగర పరిసర ప్రాంతాలకు రానున్నాయి. ఇప్పటికే రామవరప్పాడు వద్ద మారియేట్ హోటల్ ఏర్పాటు ఖరారైంది. బెంజిసర్కిల్ సమీపంలో జాతీయ రహదారి పక్కన నోవాటెల్ హోటల్ నిర్మాణానికి కసరత్తు చేస్తున్నారు. గుంటూరులో ఐటీసీ హోటల్ ఏర్పాటు కానుంది. కీస్ హోటల్‌ను నగరంలోని బందరురోడ్డులో ఏర్పాటుకు స్థలాన్ని అన్వేషిస్తున్నారు. గ్రీన్‌పార్క్‌తోపాటు మరికొన్ని అంతర్జాతీయ స్థాయి సంస్థలు కూడా స్థలాల అన్వేషణలో ఉన్నాయి.

 విజయవాడ-మంగళగిరి మధ్యే...
 నవ్యాంధ్ర రాజధాని తుళ్లూరు, మంగళగిరి మండలాల్లో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఆతిథ్య రంగానికి చెందిన సంస్థలు మాత్రం తొలుత విజయవాడకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఆ తర్వాత విజయవాడ-మంగళగిరి మధ్య ప్రాంతాన్ని ఎంచుకుంటున్నాయి.

ఇప్పటికే ఆయా ప్రాంతాలు భాగా అభివృద్ధి చెందడంతోపాటు జాతీయ రహదారి పక్కన ఉండటం, ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలకు అనువుగా ఉండటంతో ఈ ప్రాంతంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మరో ఐదారేళ్లలో తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాలు నగరంలో కలిసిపోయే అవకాశం ఉండటం కూడా మరో కారణమని ఆతిథ్య రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 పెరగనున్న ఆదాయం, ఉపాధి అవకాశాలు...
 ప్రస్తుతం నగరం గ్రేడ్-3 సిటీగా ఉంది. నవ్యాంధ్ర రాజధాని ఏర్పాటుతో పరిధి పెరిగి గ్రేడ్-1కు అప్‌గ్రేడ్ అవుతుంది. దీంతో ఆతిథ్య రంగంలో చార్జీలు పెరుగుతాయి. ఆదాయం కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నగరంలో నాలుగు నక్షత్రాల హోటళ్లు ఫార్చ్యూన్ మురళీపార్క్, తాజ్ గేట్‌వే, డీవీ మనార్ ఉన్నాయి.

వీటితోపాటు త్వరలోనే ఐదు, ఏడు నక్షత్రాల హోటళ్లు సైతం అందుబాటులోకి రానున్నాయి. ఈ క్రమంలో ఆతిథ్యరంగంలో ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే నగరానికి కార్పొరేట్ సంస్థల నిర్వాహకులు, ఉద్యోగుల రాక పెరిగింది. దీంతో  హోటల్స్‌కు ఆదాయం కూడా పెరిగింది. ముంబయికి చెందిన ఓ ఫార్మసీ కంపెనీ గతంలో హైదరాబాద్ కేంద్రంగా వ్యాపార లావాదేవీలు నిర్వహించేది. ప్రస్తుతం విజయవాడ కేంద్రంగా ఆంధ్రలో వ్యాపారం చేస్తోంది.

ఇలా పలు ఫార్మసీ కంపెనీలు, ఇతర సంస్థలు వ్యాపార విస్తరణ కోసం నగరంలో కాన్ఫరెన్స్‌లు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దీంతో గత ఆరు నెలలుగా హోటల్స్ ఆదాయం 30 నుంచి 40 శాతం పెరిగినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

 ప్రభుత్వ సమావేశాలూ హోటళ్లలోనే..
 రాష్ట్రస్థాయి సమీక్ష సమావేశాల నిర్వహణకు అనువైన కార్యాలయాలు, వసతులు నగరంలో లేనందున ప్రభుత్వం కూడా హోటళ్లనే వేదికగా ఎంపిక చేస్తోంది. రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశాలను హోటల్స్‌లోనే నిర్వహిస్తున్నారు.

 మంచి భవిష్యత్తు ఉంది
 నవ్యాంధ్ర రాజధానిగా విజయవాడ పరిసరాల ప్రాంతాలను ఎంపిక చేయడంతో నగర పరిధి పెరగుతుంది. ఇప్పటికే ఆతిథ్య రంగానికి చెందిన అనేక సంస్థలు నగరంలో హోటల్స్ ఏర్పాటుకు స్థల సేకరణలో ఉన్నాయి. ఇప్పటి వరకు నాలుగు నక్షత్రాల హోటల్స్‌కే పరిమితం కాగా, ఐదు, ఏడు నక్షత్రాల హోటల్స్ కూడా వస్తాయి. ఇప్పుడు ఉన్న హోటల్స్ కూడా అప్ గ్రేడ్ అవుతాయి. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఆతిథ్య రంగానికి మంచి భవిష్యత్తు ఉంటుంది.
 -  ముత్తవరపు మురళీకృష్ణ, ఫార్చ్యూన్ మురళీ పార్క్ హోటల్, ఎండీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement