
ధర్నా సక్సెస్
దద్దరిల్లిన బందరు కలెక్టరేట్
జిల్లా వ్యాప్తంగా భారీగా తరలివచ్చిన వైఎస్సార్ సీపీ శ్రేణులు
అధికసంఖ్యలో పాల్గొన్న యువకులు, రైతులు
విజయవాడ : ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత గాలికొదిలేయడాన్ని నిరసిస్తూ, షరతులు లేకుండా రుణమాఫీని అమలుచేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యాన శుక్రవారం బందరులోని కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నా విజయవంతమైంది. ఈ ధర్నాలో పాల్గొనేందుకు జిల్లా నలుమూలల నుంచి యువకులు, రైతులు, మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ధర్నా మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగింది. కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్మిస్తున్న రోడ్డు పైనే నాయకులు కూర్చుని ధర్నా చేశారు. ‘మోసకారి బాబు మాటలు నమ్మొద్దు’ అంటూ నాయకులు, రైతులు, మహిళలు కలెక్టరేట్ దద్దరిల్లేలా నినాదాలు చేశారు.
ప్రజలను మభ్యపెడుతున్న ప్రభుత్వం
ధర్నాలో పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు, కొందరు మంత్రులు ప్రజలను మభ్యపెట్టేందుకు మాటలు చెబుతూ కాలం గడుపుతున్నారని విమర్శించారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా నేటికీ మాఫీ చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్న చంద్రబాబును ప్రజలు భవిష్యత్తులో నమ్మబోరన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా ప్రజల కోసం నిరంతరం పోరాటం నిర్వహిస్తామని వైఎస్సార్ సీపీ నేతలు చెప్పారు. నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా జిల్లాలోని రైతుల గురించి పట్టించుకోవడం లేదని, దాళ్వా సాగుకు నీటి విడుదలపై ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన చేయలేదని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో దేవినేని ఉమా ఉత్తరకుమార ప్రగల్భాలు పలికారని, ఇప్పుడు రైతుల గురించి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సాగునీటి కోసం కూడా పోరాటం చేయాల్సి రావడం దురదృష్టకరమన్నారు. చంద్రబాబు మోసాలను ప్రజలు గమనిస్తున్నారని తగిన సమయంలో బుద్ధి చెబుతారని వైఎస్సార్ సీపీ పరిశీలకుడిగా హాజరైన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ చెప్పారు.
చంద్రబాబు నైజాన్ని వివరించిన జలీల్
చంద్రబాబు ప్రజలను మోసం చేసే విధానాన్ని ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ తనదైన శైలిలో మాట్లాడుతూ కళ్లకుకట్టినట్టు వివరించారు. బాబు మోసాలు కొంతకాలమే జనం భరిస్తారని, ఆ తర్వాత గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. పోలీసులు అక్కడక్కడా అత్యుత్సాహం చూపిస్తున్నారని, కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు దూకుడుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. పోరాటాలు తమకు నేర్పాల్సిన అవసరం లేదని, దూకుడుగా వ్యవహరిస్తే తాము మరింత దూకుడుగా ముందుకు వెళ్తామని హెచ్చరించారు. పార్థసారథిపై దాడిని తీవ్రంగా ఖండించారు. దాడులకు పాల్పడుతున్న టీడీపీ నాయకులపై, వారికి వంతపాడుతున్న ప్రజాప్రతినిధులపై ప్రజా దాడులు తప్పవని హెచ్చరించారు. ప్రజల తరఫున పోరాటాలను నిత్యం కొనసాగిస్తామని, వైఎస్సార్ కుటుంబానికి పోరాటాలు చేయడం కొత్త కాదని పలువురు నాయకులు అన్నప్పుడు కార్యకర్తల నుంచి అనూహ్య స్పందన లభించింది.