
స్టార్టప్ కంపెనీలే యువతకు భవిత
రాబోయే రోజుల్లో స్టార్టప్ కంపెనీలు యువత భవితకు మార్గం చూపిస్తాయని సీఎం చంద్రబాబు అన్నారు.
తనను కలిసిన యువకులతో సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: రాబోయే రోజుల్లో స్టార్టప్ కంపెనీలు యువత భవితకు మార్గం చూపిస్తాయని సీఎం చంద్రబాబు అన్నారు. తాము తీసుకొచ్చిన నైపుణ్య విధానం వివిధ వృత్తులు చేపట్టిన యువతకు, కార్మికులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుందన్నారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో తనను కలిసిన పలువురు యువకులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ స్టార్టప్ విధానం తమకు ఉపయోగపడిందని చెప్పిన వారు గెట్ మై టైలర్, గెట్ మై బుక్స్, హైర్ పప్పీ, గ్లోసీ ట్రెండ్స్ పేర్లతో స్టార్టప్‌లను ప్రారంభించామని తెలిపారు. వీటి ద్వారా ఏడాదికి ఆరున్నర కోట్ల టర్నోవర్‌ను అంచనా వేస్తున్నట్లు జీబీఐ బిజినెస్ డెవలప్‌మెంట్‌కు చెందిన స్వప్న సిద్ధార్థ్ ముఖ్యమంత్రికి చెప్పారు.
గెట్ మై టైలర్ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా టైలరింగ్ వచ్చినవారిని ఆన్‌లైన్ ద్వారా అందరికీ పరిచయం చేస్తున్నామన్నారు. ఈ స్టార్టప్‌ను ప్రారంభించిన రాజమండ్రికి చెందిన తాడిమళ్ల కమలాకర్ 241 మీటర్ల వస్త్రంతో 47 అడుగుల పొడవు, 21 అడుగుల వెడల్పు ఉన్న చొక్కాను చంద్రబాబుకు చూపించారు. హైర్ పప్పీ.కామ్ ద్వారా ఎవరైనా తాము కొనలేని వస్తువులను ఒకరోజు అద్దెకు తీసుకుని ఉపయోగించుకోవచ్చని మరో యువతి తెలిపింది. తాము కాకినాడ సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నామని తెలిపారు. ఇదిలా ఉండగా గుంటూరు జిల్లా నల్లమడ డ్రైన్ ప్రభావిత ప్రాంతంలోని పెదనందిపాడు, కాకుమాను మండలాలకు చెందిన పలువురు రైతులు శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. నల్లమడ డ్రైన్ ఆధునీకరణకు నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.