సాక్షి, అమరావతి: యువత శిక్షణ కోసం భారీగా ఆర్థిక సహాయం అందిస్తామని అప్పటిదాకా నమ్మబలికిన ప్రైవేట్ కంపెనీ ప్లేటు ఫిరాయించింది! భారీ లాభాన్ని వేసుకుని మరీ ప్రాజెక్టును దక్కించుకుని ప్రజాదనాన్ని కాజేసింది. రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) కుంభకోణంలో తవ్వేకొద్దీ కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత జీవోలు, ఒప్పందాల్లో ఉన్న ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్ (ఆర్థిక సహకారం) అనే పదం స్థానంలో తరువాత ‘గ్రాంట్ ఇన్ కైండ్ (వస్తు సహకారం) చేరింది. చివరకు ‘గ్రాంట్ ఇన్ కైండ్’ సైతం అదృశ్యమైంది. ఈ మాయాజాలంతో చివరకు టెండర్ల ప్రక్రియ అనేదే లేకుండా పోయింది. తద్వారా డిజైన్‌టెక్‌కు ఏకపక్షంగా కట్టబెట్టేసి రూ.371 కోట్లు చెల్లించేశారు. అందులో రూ.241 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బాబు గూటికి చేరవేశారు.
34.88 శాతం లాభంతో..
ఏపీ ఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్టు ముసుగులో నిధులను కొల్లగొట్టాలని ముందుగానే నిర్ణయించుకున్న మాజీ సీఎం చంద్రబాబు ఆరు క్లస్టర్లుగా అంచనా వ్యయం నివేదికను రూపొందించాలని ఆదేశించారు. వివిధ అంశాలను ప్రాతిపదికగా చేసుకుని అధికారులు ఏడు నివేదికలు రూపొందించారు. వాటిల్లో ప్రాజెక్టు కనిష్ట వ్యయం రూ.214 కోట్లు కాగా గరిష్ట వ్యయం రూ.282 కోట్లుగా మాత్రమే ఉంది. బినామీ సంస్థ డిజైన్ టెక్ లాభం 34.88 శాతాన్ని కూడా కలిపి ఒక్కో క్లస్టర్‌కు రూ.55 కోట్లు చొప్పున మొత్తం ఆరు క్లస్టర్లకు రూ.330 కోట్లు అవుతుందని నివేదిక రూపొందించారు.
అందులో 90 శాతం సీమెన్స్–డిజైన్ టెక్ భరిస్తాయని, మిగతా 10 శాతం నిధులను ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అసలు ఈ ప్రాజెక్టు గురించే సీమెన్స్ కంపెనీకి తెలియదు. ఆ కంపెనీ 90 శాతం నిధులను సమకూర్చదని చంద్రబాబుకు స్పష్టంగా తెలుసు. 34.88 శాతం అంటే భారీ లాభమే. మరి లాభం ప్రస్తావన ఉన్న ప్రాజెక్టుకు ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’ ఎలా వస్తుందనే ప్రాథమిక అంశాన్ని కూడా చంద్రబాబు పరిగణలోకి తీసుకోలేదు. ప్రజల్ని మభ్యపెట్టేందుకే ఆ కంపెనీ పేరును వాడుకున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం రూ.330 కోట్లు వ్యయం అవుతుంది అని రూపొందించిన నివేదిక.. కానీ ప్రాజెక్ట్ వ్యయాన్ని ఏకంగా రూ.3,300 కోట్లకు పెంచేసి ప్రజాధనం కొల్లగొట్టారు
అంచనాలు పెంచి వాటా నిధులు స్వాహా
ప్రాజెక్టు వ్యయాన్ని భారీగా పెంచేస్తే అందులో ప్రభుత్వం వాటా 10 శాతం కింద వెచ్చించాల్సిన నిధులు కూడా ఆ మేరకు పెరుగుతాయి. తద్వారా ఆ నిధులను షెల్ కంపెనీల ద్వారా అక్రమంగా మళ్లించేలా చంద్రబాబు పథకం వేశారు. అందుకే ఆరు క్లస్టర్లకు కలిపి రూ.330 కోట్లుగా ఉన్న ప్రాజెక్ట్‌ను ఏకంగా రూ.3,300 కోట్లకు అమాంతం అంచనాలు పెంచేసి ఖరారు చేశారు.
సిమెన్స్ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండానే ప్రభుత్వ వాటా 10 శాతం కింద జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లను నిబంధనలకు విరుద్ధంగా చెల్లించేశారు. చంద్రబాబు ఆదేశాలతోనే నిధులు చెల్లించినట్లు ఆర్థిక శాఖ అధికారులు వాంగ్మూలం కూడా ఇచ్చారు. అందులో షెల్ కంపెనీల ద్వారా రూ.241 కోట్లు చంద్రబాబు గూటికి చేరాయి. అదే విషయం సీఐడీ దర్యాప్తులో ఆధారాలతో సహా వెల్లడైంది.
ఎయిడ్ లేదు.. కైండ్ అంత కంటే లేదు
ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్టు వ్యయంలో 90 శాతం నిధులను సీమెన్స్ కంపెనీ ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’గా సమకూరుస్తుందని టీడీపీ సర్కారు జీవోలో పేర్కొంది. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ గురించి సీమెన్స్ కంపెనీకి ఏమాత్రం తెలియదు. ఢిల్లీలో ఆ కంపెనీ ఎండీగా ఉన్న సుమన్ బోస్ ద్వారా చంద్రబాబు ముఠా గూడుపుఠాణి నడిపించింది. జీవో జారీ చేసిన తరువాత డిజైన్ టెక్ కంపెనీని రంగంలోకి తెచ్చారు. సీమెన్స్–డిజైన్ టెక్ కంపెనీలు ప్రాజెక్ట్ వ్యయంలో 90 శాతాన్ని గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా సమకూరుస్తాయంటూ త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నారు.
అసలు కథ ఇక్కడే మొదలైంది.సీమెన్స్ కంపెనీకి తెలియకుండా సుమన్ బోస్ నడిపిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో (నేరుగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుకు లేఖలు రాశారు) గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే పదం ఎక్కడా లేదు. ఆ స్థానంలో ‘గ్రాంట్ ఇన్ కైండ్’ అని పేర్కొన్నారు. పోనీ ఆ విధంగానైనా సాఫ్ట్‌వేర్, ఇతర మౌలిక సదుపాయాలు ఉచితంగా అందించారా? అంటే అదీ లేదు.
ప్రాజెక్టు వ్యయంగా చెప్పుకున్న రూ.3,300 కోట్లలో 90 శాతం కాదు కదా కనీసం ఒక్క రూపాయి విలువైన ఆర్థిక సహకారంగానీ వస్తు సహాయాన్ని గానీ అందించ లేదు. చంద్రబాబు వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ వాటా 10 శాతం కింద జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లను డిజైన్‌టెక్‌కు చేరవేశారు. అంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్ లేదు! గ్రాంట్ ఇన్ కైండ్ అంత కంటే లేదు! చివరికి చంద్రబాబు దోపిడీ మాత్రమే మిగిలిందని స్పష్టమైంది.
టెండర్లు లేకుండా కట్టబెట్టడానికే...
సుమన్ బోస్ నాటి సీఎం చంద్రబాబుతో సాగించిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’ అనే పదాన్ని ఎక్కడా వాడలేదు. చంద్రబాబు మాత్రం సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలు 90 శాతం నిధులను ఆర్థిక సహాయంగా సమకూరుస్తాయని ఎందుకు చెబుతూ వచ్చారన్నది కీలకంగా మారింది. ఎందుకంటే...? గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని ఉంటే టెండర్లు పిలవాల్సిన అవసరం లేదు.
ఓ ప్రాజెక్టులో ప్రైవేటు కంపెనీలు లాభం తీసుకుంటే నిబంధనల ప్రకారం టెండర్లు పిలవాలి. టెండర్లు పిలిస్తే అర్హత ఉన్న ఎన్నో కంపెనీలు పోటీ పడతాయి. ప్రాజెక్ట్‌ను యధాతథంగా అమలు చేయాల్సి ఉంటుంది. అందుకే టెండర్ల ప్రక్రియ లేకుండా ఏకపక్షంగా నామినేషన్ విధానంలో డిజైన్‌టెక్‌కు ఈ ప్రాజెక్టు కట్టబెట్టడానికే చంద్రబాబు ఈ పథకం వేశారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే ముసుగులో డిజైన్ టెక్‌కు కట్టబెట్టేశారు. తరువాత నిబంధనలకు విరుద్ధంగా ఆ కంపెనీకి రూ.371 కోట్లు విడుదల చేశారు. కమీషన్లు పోనూ అందులో రూ.241 కోట్లను హైదరాబాద్‌లోని తన బంగ్లాకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment