విభజన టెన్షన్.. నేతల అటెన్షన్
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఒకవైపు రాష్ట్ర విభజనపై ఎడతెగని ఉత్కంఠ.. మరోవైపు ముంచుకొస్తున్న ఎన్నికలు.. ఈ రెండూ రాజకీయ నాయకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అన్ని పార్టీల్లోనూ ఈ రెండు విషయాలే కీలకాంశాలుగా మారాయి. రాష్ర్ట విభజన నేపథ్యంలో తమ భవిష్యత్ ఎలా ఉంటుం దనే ఆందోళనతోనే ఆయా పార్టీల నేతలు రాబోయే ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించడం, గడపగడపకూ వైసీపీ, ఓటర్ల నమోదు, బూత్ కమిటీల నియామకం వంటి కార్యక్రమాలతో జనంలోకి వెళుతున్నారు. ప్రజల సమస్యలపై ఆందోళనలు చేయడంలోనూ ఆ పార్టీ నేతలు ముందుంటున్నారు. అన్నివర్గాల ప్రజల్లోనూ ఆ పార్టీకి ఆదరణ ఉండడంతో నాయకుల కార్యకలాపాలు యథావిధిగా జరుగుతున్నాయి. అయితే తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల్లో మాత్రం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
కాంగ్రెస్ నేతల్లో అయోమయం
కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులైతే తమ భవిష్యత్‌పై తీవ్రస్థాయిలో మదనపడుతున్నారు. విభజన వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు విలన్‌గా చూస్తుండటంతో వారు నియోజకవర్గాల్లో తిరగడానికే భయపడుతున్నారు. కొందరు నాయకులు మొండిగా తిరుగుతున్నా జనం తమను పట్టించుకోకపోవడం వారికి మింగుడు పడటం లేదు. ఈ పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో ఏదో ఒక ముసుగులో జనం ముందుకు వెళ్లేందుకు వ్యూహ రచనల్లో తలమునకలై ఉన్నారు. కొందరు నాయకులు ఇతర పార్టీల్లోకి జంప్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరికొందరు ఎటూవెళ్లే పరిస్థితి లేక మౌనంగానే ఉండిపోతున్నారు. దీంతో నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి హీనాతిహీనంగా మారింది. చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులు రంగంలో ఉంటారో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఉదాహరణకు ఏలూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకుడే లేకుండాపోయాడు. ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు ఏదోఒక పదవిని దక్కించుకునేందుకు రకరకాల రాజకీయాల్లో మునిగితేలుతున్నారు. దెందులూరు, గోపాలపురం, పోలవరం, కొవ్వూరు తదితర నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీని నడిపించే నాయకులు కరువయ్యారు. మిగిలిన చోట్ల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలున్నా అచేతనంగా ఉండిపోయూరు.
టీడీపీలో గందరగోళం
తెలుగుదేశం పార్టీలోనూ గందరగోళం నెలకొంది. రాష్ట్ర విభజన వ్యవహారంలో స్పష్టమైన వైఖరి లేకపోవడం ఆ పార్టీకి మైనస్‌గా మిగిలిపోయింది. దీనిపై ప్రజలకు సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఆ పార్టీ నేతలు కొట్టుమిట్టాడుతున్నారు. అయితే ఉనికిని కాపాడుకునేందుకు ఏదో ఒక కార్యక్రమం చేపడుతున్నారు. ఇదే సమయంలో కొన్నిచోట్ల ఆ పార్టీని నడిపించే నాథులు లేకుండాపోయారు. నరసాపురం, తాడేపల్లిగూడెం, గోపాలపురం, పోలవరం, ఆచంట తదితర నియోజకవర్గాల్లో పార్టీని నడిపించే వారు కనిపించడంలేదు. మిగిలిన నియోజకవర్గాల్లో నేతలు సీట్ల కోసం కుమ్ములాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల్లో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఏ పార్టీ తరఫున ఎవరు బరిలో ఉంటారు, వారి పరిస్థితి ఏమిటనే విషయాలపై గ్రామాల్లో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం మధ్యే పోటీ జరుగుతుందనే వాదనలతోపాటు ఆయా పార్టీల తరఫున ఎవరు పోటీలో ఉండే అవకాశం ఉందనే విషయాల గురించే మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ చూసినా రాష్ట్ర విభజన, నియోజకవర్గంలో సీట్ల గురించే చర్చోపచర్చలు సాగుతున్నాయి.