అన్ని శాఖలకు ఆర్థికశాఖ సర్క్యులర్
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను.. రాష్ట్ర విభజన నేపధ్యంలో ఏర్పాటయ్యే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) రెండు రాష్ట్రాలకు విభజించాల్సిందిగా ఆర్థికశాఖ బుధవారం అన్ని శాఖలు, విభాగాల అధిపతులను ఆదేశించింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి ప్రత్యేకంగా సర్క్యులర్ జారీచేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్‌ను రూ. 1,83,129 కోట్లుగా ఆర్థికశాఖ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపధ్యంలో ఇందులో తొలి ఆరు నెలల వ్యయానికి మాత్రమే అసెంబ్లీ నుంచి ఓటాన్ అకౌంట్‌కు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. అయితే జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోతున్నందున ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలలైన ఏప్రిల్, మే నెలల్లో బడ్జెట్ కేటాయింపులో ఆరో వంతు అంటే.. రూ. 30,521 కోట్లు మాత్రమే ఆయా శాఖలు వ్యయం చేసేందుకు ఆర్థికశాఖ అనుమతించింది. ఏ శాఖ ఎంత వ్యయం చేయాలనే విషయాన్ని కూడా ఆర్థికశాఖ స్పష్టం చేయనుంది. బడ్జెట్‌లో పథకాలు, కార్యక్రమాల అమలు, జీతభత్యాలు, పెన్షన్లతో పాటు అన్ని రంగాలకు కేటాయించిన నిధులను తెలంగాణ రాష్ట్రానికి ఎంత, ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో తెలియజేస్తూ ఈ నెల 15వ తేదీలోగా ఆర్థికశాఖ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. మరోపక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సంచిత నిధిని కూడా రెండు రాష్ట్రాలకు విభజించాలని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి అజేయ కల్లం బుధవారం రాష్ట్ర అకౌంటెంట్ జనరల్‌కు లేఖ రాశారు.
రాష్ట్ర బడ్జెట్‌ను 2 రాష్ట్రాలకు విభజించండి
Published Thu, Apr 3 2014 4:20 AM | Last Updated on Sat, Sep 2 2017 5:29 AM
Advertisement
Advertisement