
మంత్రులకు ఏ శాఖలిస్తారో
సాక్షి, ఏలూరు : రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కిన పైడికొండల మాణిక్యాలరావు, పీతల సుజాతకు ఏ శాఖలు కేటాయిస్తారనే అంశంపైనే అందరి దృష్టి ఉంది. వీరికి ఏ శాఖలపై ఆసక్తి ఉందనే అంశంపై చంద్రబాబు మంగళవారం ఆరా తీశారు. వారి అభిప్రాయాలు విన్న తర్వాత ఏ శాఖ కేటాయించాలనే దానిపై ఆయన ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బుధవారం ఉదయానికి వారికి కేటాయించిన శాఖలు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. దేవాదాయ, వ్యవసాయ, పంచాయతీరాజ్ శాఖలలో ఒక శాఖను లేదా రెండిటిని మాణిక్యాలరావుకు కేటాయించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.
తనకు ఏ శాఖ ఇచ్చినా సమ్మతమేనని చంద్రబాబుతో చెప్పానని, తమనుంచి అభిప్రాయాలు తీసుకోవడం మినహా ఏ శాఖ ఇస్తారనేది గోప్యంగా ఉంచారని మంత్రి మాణిక్యాలరావు ‘సాక్షి’తో అన్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి జిల్లాలో ఏకైక మహిళా ఎమ్మెల్యే అరుున పీతల సుజాతకు సాంఘిక సంక్షేమ, మహిళా సంక్షేమ శాఖలలో ఒక దానిని లేదా రెండిటినీ కేటారుుంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆమెకు కేబినెట్‌లో స్థానం దక్కినప్పటినుంచీ చంద్రబాబు కోటరీని వెన్నంటే ఉంటున్నారు. ప్రాధాన్యత గల శాఖను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫోన్లో సైతం అత్యంత ముఖ్యలకు మినహా ఎవరికీ అందుబాటులోకి రావడం లేదు.