సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు ప్రాజెక్టు గడువులోగానే గమ్యం చేరనుంది. ముందుగానే నిర్దేశించుకున్న లక్ష్యాన్ని 2017 జనవరి 1వ తేదీ నాటికి సాధించనుంది. గ్రేటర్ పరిధిలో సుమారు 20 లక్షల మంది ప్రయాణికులకు ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి విముక్తి కల్పించనుంది. నాగోల్-శిల్పారామం, ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఫలక్‌నుమా కారిడార్ల పరిధిలో 72 కిలోమీటర్ల మార్గంలో ప్రస్తుతం మెట్రో పనులు చురుగ్గా సాగుతున్నాయి. రాష్ట్ర విభజన అంశం తెరమీదకు వచ్చినప్పటికీ ఆ ప్రభావం మెట్రో పనులపై పడబోదని హైదరాబాద్ మెట్రో రైల్(హెచ్‌ఎంఆర్), ఎల్‌అండ్‌టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. టెండర్ల ప్రక్రియ, నిధుల కేటాయింపు, ఒప్పందాల ప్రక్రియలన్నీ 2011 చివరి నాటికే పూర్తయ్యాయని చెబుతున్నారు.
ప్రాజెక్టుకు నిధులను ఎల్‌అండ్‌టీ సంస్థ పలు జాతీయ బ్యాంకుల నుంచి సేకరించనుంది. ఈ విషయంలోనూ ఎలాంటి అడ్డంకులు ఎదురు కాబోవని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ (పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం) ప్రాజెక్టుగా చేపట్టిన ఈ పథకాన్ని రూ.16,112 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. ప్రాజెక్టుకు ఎల్‌అండ్‌టీ సంస్థ రూ.12,674 కోట్లు వెచ్చిస్తుండగా, కేంద్ర ప్రభుత్వం సర్దుబాటు నిధి కింద రూ.1,458 కోట్లు కేటాయించనుంది. భూ సేకరణ, స్థిరాస్తులకు పరిహారం చెల్లింపు, పునరావాసం, స్కైవాక్‌ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,980 కోట్లు ఖర్చు చేయనుంది. మెట్రో రైలు ప్రాజెక్టు పనులు 2012 మే నెలలో మొదలయ్యాయి. ప్రస్తుతం నాగోల్-మెట్టుగూడ, మియాపూర్-ఎస్‌ఆర్ నగర్, ఎల్బీనగర్-మలక్‌పేట్, మెట్టుగూడ-బేగంపేట మార్గాల్లో పిల్లర్లు, వాటిపై వయాడక్ట్ సెగ్మెంట్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు సుమారు 700 పిల్లర్లు, 3 వేల వయాడక్ట్ సెగ్మెంట్లను ఏర్పాటు చేశారు. ఉప్పల్ రింగ్‌రోడ్డులో మెట్రో స్టేషన్‌తోపాటు మెట్రో రైలు పట్టాలు ఏర్పాటవుతున్నాయి. మెట్రో రైలు ప్రాజెక్టు పనులు మరో 40 మాసాల్లో పూర్తికానున్నాయని హెచ్‌ఎంఆర్ వర్గాలు తెలిపాయి.
రాష్ట్ర విభజన ప్రభావం మెట్రో రైలు ప్రాజెక్టుపై ఉండదు
Published Sun, Aug 11 2013 12:44 AM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM
Advertisement
Advertisement