రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సమైక్యవాదులు ఆందోళనలు ఉధృతంగా కొనసాగిస్తున్నారు. మానవహారాలు, వంటావార్పులు, వినూత్న నిరసనలు 61వ రోజూ జిల్లా అంతటా కొనసాగాయి. 13 జిల్లాల రవాణా ఉద్యోగుల జేఏసీ విజయవాడలో సమావేశమై ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించింది.
సాక్షి, విజయవాడ : రాష్ట్రాన్ని విడదీస్తే అభివృద్ధి వందేళ్లు వెనక్కి పోతుందని, సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని సమైక్యవాదులు డిమాండ్ చేశారు. సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం 61వ రోజైన ఆదివారం కూడా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. మైలవరంలో సహస్ర సకల జనుల నిరాహార దీక్ష నిర్వహించారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసన తెలిపారు. విజయవాడలో 13 జిల్లాల రవాణా జేఏసీ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. జగ్గయ్యపేటలో జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలో కూర్చున్న ముస్లింలకు వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను సతీమణి విమలాభాను మద్దతు తెలిపారు. ఉద్యోగ జేఏసీ నాయకులు చెప్పులు కుట్టి రాష్ట్ర విభజన నిర్ణయంపై తమ నిరసన వ్యక్తం చేశారు.
విడదీస్తే వలసలే..
కైకలూరు జేఏసీ నాయకులు తెలంగాణ విడదీస్తే వలసలు ఏ విధంగా ఉంటాయనే చూపించడానికి తట్టా బుట్టలతో ప్రదర్శన చేశారు. తిరువూరులో గీతకార్మికులు ప్రదర్శన జరిపారు. గన్నవరంలో బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో గోపూజ, రిలే దీక్షలు చేశారు. గుడివాడ నెహ్రూచౌక్ సెంటర్‌లో కాపుసేవాసమితి నాయకులు దీక్షల్లో పాల్గొన్నారు. పామర్రు నాలుగు రోడ్ల కూడలిలో జాతీయ రహదారిపై జై సమైక్యాంధ్ర అంటూ రంగులతో అలంకరించి ఉపాధ్యాయులు నిరసనలు తెలిపారు. రైతులు ట్రాక్టర్లతో ప్రదర్శన నిర్వహించి ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. స్థానిక కొబ్బరితోటలోని మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు.
కోలవెన్నులో సమైక్యవాదులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. కృత్తివెన్నులో జేఏసీ నాయకులు డప్పులు కొడుతూ ఈ దరువు ఢిల్లీ పెద్దల తలుపులు తెరవాలని ఆకాంక్షిస్తూ నిరసన తెలిపారు. పెడన జేఏసీ ఆధ్వర్యంలో వస్త్ర వ్యాపార సంఘాల నాయకులు రిలే దీక్ష చేపట్టారు. కృత్తివెన్ను జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షా శిబిరాన్ని వైఎస్సార్‌సీపీ రైతువిభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. కంచికచర్లలో ఏపీ ఎన్జీవోలు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులు సంయుక్తంగా మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఇందిరాగాంధీ బొమ్మ వద్ద మాక్ అసెంబ్లీ నిర్వహించారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో పెద్ద గాంధీబొమ్మ సెంటర్‌లో ఒకరోజు రిలేదీక్ష చేశారు.
చల్లపల్లి మండలం వక్కలగడ్డ విద్యార్థులు చిన్నగాంధీబొమ్మ సెంటర్‌లో డప్పు వాయిద్యం, విన్యాసాలతో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. మోపిదేవిలో శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం ఎదుట ప్రధాన జాతీయ రహదారిపై గొర్రెల మందతో నిరసన తెలిపారు. రైల్వేస్టేషన్ రోడ్డులో గల సీఎస్‌ఐ క్రైస్ట్ చర్చి సభ్యులు రోడ్డుపైనే సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. సునీతా టవర్స్ రెసిడెన్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 72 గంటల రిలేదీక్షలు ముగిశాయి. మచిలీపట్నం కోనేరుసెంటర్‌లో అధ్యాపకులు, ఉపాధ్యాయులు, కంప్యూటర్ సెంటర్‌ల నిర్వాహకులు దీక్షలో పాల్గొన్నారు. నందిగామలో పూలు, టీ విక్రయిస్తూ వైఎస్సార్ సీపీ నేతలు నిరసన తెలిపారు. సోనియాకు నీవైనా చెప్పంటూ ముస్లిం యువకులు ఇందిరమ్మ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
రాష్ట్రాన్ని విభజిస్తే వందేళ్లు వెనక్కే..
Published Mon, Sep 30 2013 2:09 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement