రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు నలుగురు ఎంపిక
Published Wed, Sep 4 2013 4:54 AM | Last Updated on Fri, Sep 1 2017 10:24 PM
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు నలుగురు, నేషనల్ ఫౌండేషన్ టీచర్స్ వెల్ఫేర్(ఎన్‌ఎఫ్‌టీడబ్ల్యూ)కు ముగ్గురు ఎంపికయ్యారు. రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు మొత్తం 57మంది, ఎన్‌ఎఫ్‌టీడబ్ల్యూకు 38 మందిని ఎంపికకాగా వీరిలో జిల్లాకు చెందిన ఏడుగురు ఉపాధ్యాయులు ఉండటం విశేషం.
ఉత్తమ ఉపాధ్యాయల అవార్డులకు పెదవేగిలోని ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎన్.సంజీవరావు, దెందులూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు తెర్లి అప్పారావు, చింతలపూడిలోని సీఎస్‌ఐ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు బొకినాల ఝాన్సీశారదాబాయి, భీమవరం పీఎస్‌ఎం ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రాఫ్ట్ టీచర్ జీవీ రాజ్యలక్ష్మి ఎంపికయ్యారు.
ఎన్‌ఎఫ్‌టీడబ్ల్యూకు తాడేపల్లిగూడెం మండలం లింగరాయుడుగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఎస్.వెంకటరమణ, ఇదే మండలం నందమూరులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని డి.కమలాబాయి, తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్ తెలుగు ఉపాధ్యాయులు కేవీ గణపతిరావు ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాదులోని రవీంద్రభారతిలో గురువారం ఉదయం 10గంటలకు నిర్వహించే కార్యక్రమంలో ఈ ఉపాధ్యాయులను ముఖ్యమంత్రి చేతుల మీదుగా సన్మానిస్తారు. రూ.3వేల నగదు, పసిడి పూత పూసిన రజత పతకం, ధ్రువీకరణపత్రం అందజేసి శాలువతో సత్కరిస్తారు.
Advertisement