- రోడ్డు ప్రమాదంలో స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి మృతి
- కొప్పాక జంక్షన్ వద్ద ఢీకొన్న రెండు కార్లు
అనకాపల్లిరూరల్: కాసేపట్లో ఇంటికి చేరాల్సిన వ్యక్తిని రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబళించింది. ఈ సంఘటన మండలంలోని కొప్పాక జాతీయ రహదారి మలుపు వద్ద ఆదివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లి విజయరామరాజు పేటకు చెందిన ఎ.వి.ఎస్.అప్పారావు స్టీల్ ప్లాంట్‌లో ఎలక్ట్రికల్ ఎస్‌ఎమ్‌ఎస్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవలే కొప్పాకలో సొంత ఇల్లు నిర్మించుకున్నాడు.
ఆదివారం స్టీల్‌ప్లాంట్‌లో విధులు ముగించుకొని ఇంటికి కారులో బయలుదేరాడు. కొప్పాక జంక్షన్ మలుపు వద్ద అనకాపల్లి నుంచి విశాఖ వైపు వెళ్తున్న ఇన్నోవా కారు బలంగా ఢీ కొట్టింది. దీంతో కారు పల్టీలు కొట్టగా అప్పారావు బయటకు తూళి పడ్డాడు. తలకు బల మైన గాయమవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో కారు డ్రైవర్ పరారయ్యాడు.
స్థానిక యువకుడు గమనించి బైక్‌పై సుమారు మూడు కిలోమీటర్లు వెంబడించి కారుతో పాటు అందులో ఉన్న వారందరినీ సంఘటన స్థలానికి తీసుకువచ్చాడు. ప్రమాదంలో ఇన్నోవా కారులో ఉన్న కర్రి సన్యాసమ్మ, బుద్ధ జగదీశ్వరావు, బుజ్జి, కర్రి పద్మలకు గాయాలయ్యాయి. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విజయరామరాజుపేట, కొప్పాకలో విషాదఛాయలు
అందరితో కలిసిమెలసి ఉండే అప్పారావు మృతితో విజయరామరాజుపేట, కొప్పాకలో విషాదఛాయలు అలుముకున్నాయి. అధిక సంఖ్యలో తరలివచ్చిన జనం మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు.