దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు సహేతుకం కాదని ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.
సాక్షి, హైదరాబాద్: దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు సహేతుకం కాదని ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, రూపాయి పతనంతో కొత్తగా ఏర్పడే రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరారు. లక్ష్మీపార్వతి సోమవారం సచివాలయంలో సీఎంను కలిశారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల వరకూ రాష్ట్ర విభజనను ఆపాలని సీఎంను కోరినట్టు చెప్పారు. అసెంబ్లీని సమావేశపరిచి ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని కోరానన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం ఓట్లు, సీట్ల కోసమే రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుందని, దీన్ని మేధావులెవరూ హర్షించడం లేదన్నారు. రాష్ట్రాన్ని విభజించాలన్న డిమాండ్‌తోనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీలో నిరాహార దీక్ష చేశారని చెప్పారు. సమన్యాయం అంటున్నారే తప్ప రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చంద్రబాబు ఏనాడు కోరలేదని పేర్కొన్నారు. విభజనకు అనుకూలంగా కేంద్రమంత్రి పురంధేశ్వరి మాట్లాడడం దివంగత ఎన్టీఆర్‌ను, ఆయన వంశాన్ని అవమానపరచడమేనన్నారు. రాష్ట్ర సమైక్యత కోసం ఎవరు పోరాడినా తన మద్దతుంటుందని, ఈనెల 26న వైఎస్సార్‌సీపీ హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ‘సమైక్య శంఖారావం’ సభలో పాల్గొంటానని చెప్పారు.