సైఖతం
గుర్తించిన ఇసుక రీచ్‌ల్లో మొత్తం తవ్వేసి ఆరు నెలలకే ఖాళీచేశారు. రీచ్‌ల్లో పూర్తిగా ఇసుక నిండుకొని మూతపడ్డాయి. దీంతో జిల్లాలో ఇసుక ఇక్కట్లు మళ్లీ ప్రారంభమయ్యాయి. నిర్మాణ రంగం నత్తనడకన సాగుతోంది. ఇసుక కోసం బిల్డర్లు ఇతర జిల్లాలకు పరుగుతీస్తున్నారు.
- నిండుకున్న ఇసుక..
- మూతపడిన రీచ్‌లు
- నిలిచిన అమ్మకాలు
- ఇక్కట్లలో నిర్మాణ రంగం
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో ఇసుక రీచ్‌లు మూతపడ్డాయి. మరో పక్క ఇసుక డిపోల్లో సైతం ఇసుక ఖాళీ అయి పోవడంతో జిల్లాలో ఇసుక అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. జిల్లాలో గత ఏడాది నవంబర్‌లో అట్టహాసంగా ఇసుక అమ్మకాలకు శ్రీకారం చుట్టారు. డిసెంబర్ నుంచి పూర్తి స్థాయిలో జిల్లాలో గుర్తించిన 21 రీచ్‌ల్లో తవ్వకాలను ప్రారంభించారు. రెండు శాండ్ డిపోలను కూడా ప్రారంభించారు. ఒక వైపు రీచ్‌ల్లో అమ్మకాలు సాగిస్తూనే మరో వైపు విజయనగరం, శ్రీకాకుళం జిల్లా ల్లో రీచ్‌ల నుంచి తరలించిన ఇసుకను డిపోల ద్వారా విక్రయించి రికార్డు స్థాయిలో వ్యాపారం సాగించారు.
గతంలోఎన్నడూలేని రీతిలో రీచ్‌ల ద్వారా 1.22 లక్షలు, డిపోల ద్వారా మరో 62 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక అమ్మకాలు సాగించడం ద్వారా రూ.12 కోట్ల మేర వ్యాపారం సాగించారు. రీచ్‌ల ద్వారానే ఆరు కోట్ల వ్యాపారం జరగ్గా డిపోల ద్వారా మరో ఐదు కోట్ల వరకు వ్యాపారం జరిగింది. ఒక వైపు రీచ్‌ల్లో ఇసుక నిండుకోవడం.. గుర్తించిన కొత్త రీచ్‌లకు పూర్తి స్థాయిలో అనుమతుల్లేకపోవడం.. మరో పక్క శ్రీకాకుళం, విజయనగరం రీచ్‌ల్లో ఇసుక రవాణా క్రమేపి తగ్గిపోవడంతో నెల రోజులుగా ఇసుక అమ్మకాలు పూర్తిగా మందగించాయి. ప్రస్తుతం గత వారం రోజులుగా ఇసుక దొరకని పరిస్థితి నెలకొంది.
ప్రస్తుతం మాడుగుల మండలం సాగరం, చోడవరం మండలం గజపతినగరం రీచ్‌లలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నా అవి స్థానిక అవసరాలకు కూడా పూర్తి స్థాయిలో సరిపోని పరిస్థితి. గజపతినగరంలో మరో ప్రాం తంతో పాటు సోమిదేవులపల్లిలలో గుర్తించిన ఇసుక రీచ్‌లలో తవ్వకాలకు ఇంకా అనుమతి రావాల్సి ఉంది. ఇప్పటివరకు 10,599 ఆర్డర్ల ద్వారా లక్షా 84వేల 116 క్యూబిక్ మీటర్ల ఇసుకను విక్రయించగలిగారు. ఇప్పటి వరకు రీచ్‌ల ద్వారా లక్షా 22 వేల 124 క్యూబిక్ మీటర్ల ఇసుకను వెలికి
తీసి విక్రయించడం ద్వారా ఆరు కోట్ల 10 లక్షల 62వేల వ్యాపారం చేశారు. ఈ మొత్తంలో స్థాని క సంస్థలకు సీనరేజ్ కింద 48లక్షల 84వేల 960లను ఇసుక రీచ్‌లను నిర్వహించిన డ్వాక్రా సంఘాల వేతనాల కింద రూ.18 ,60,660లు, ఇన్సెంటివ్ కింద రూ.6,10,620లు దక్కింది. ఇక మిషనరీ లోడింగ్ చార్జీల పేరిట రూ.62 55,960 ఖర్చుచేశారు. ర్యాంపుల నిర్మాణం కోసం రూ.6,10,620, అప్రూవల్స్ క్లియరెన్స్‌కోసం రూ.6,10,620 ఖర్చు చేశారు.
ర్యాంపుల నిర్వహణ, ఫెన్సింగ్ కోసం రూ. 6,79,740, సీసీ టీవీల ఏర్పాటు, మోనటరింగ్ కోసం ఏకంగా రూ.18,31,860 వెచ్చించారు. పరిపాలనాపరమైన ఖర్చు(సెర్ప్) కోసం 18 లక్షల 31 వేలు ఖర్చుచేసినట్టు లెక్క చూపారు. ఈవిధంగా మొత్తం రూ. కోటి 91 లక్షల 76 వేల 900 ఖర్చు చేసినట్టుగా అధికారులు లెక్కతేల్చారు. రీచ్‌లతో పాటు శాండ్ డిపోలు కూడా ఇసుక లేక బోసిపోతున్నాయి. మొత్తమ్మీద ఇసుక అమ్మకాలు నిలిచిపోవడంతో భవన నిర్మాణ రంగం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.