బాధితుల పరేషన్
శ్రీకాకుళం పాతబస్టాండ్: సర్కారు వైఫల్యం, అధికారుల ప్రణాళిక లోపం కలిసి తుపాను, వరద బాధితులను మరిన్ని కష్టాల్లోకి నెడుతున్నాయి. తుపాను వచ్చి 12 రోజులైంది. ఆ వెంటనే నాగావళి వరదలతో జిల్లాలో 11 మండలాల్లోని పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ప్రభుత్వం ఆర్భాటంగా సహాయం ప్రకటించినా.. సరైన వసతి, రవాణా సదుపాయాలు కల్పించకుండా పంపిణీ వేగవంతం చేయాలని ఒత్తిళ్లు పెంచుతున్నారు. తీరప్రాం తాలకు సరుకులు అందుతున్నా మైదాన ప్రాంతాలను పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ తీర మండలాలు మినహా మిగిలిన మండలాల్లో బియ్యం, ఉల్లి, బంగాళాదుంపలు, పామాయిల్, కారం, ఉప్పు వంటి సరుకులు అందడంలేదు. పంపిణీ జరుగుతున్న ప్రాంతాల్లోనూ పూర్తి స్థాయిలో లేకపోవడంతో రేషన్ షాపుల వద్ద బాధితులు బారులుతీరి సరుకుల కోసం ఎగబడుతున్నారు. గంటల తరబడి క్యూల్లో నిరీక్షిస్తున్నారు.
కమిటీలకు పంపిణీ బాధ్యతలు
సరుకుల పంపిణీ బాధ్యతను జన్మభూమి-మాఊరు గ్రామ కమిటీలకు అప్పగించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాజకీయ ప్రాబల్యంతో ఏర్పడిన ఈ కమిటీలపై పింఛన్లు, రేషన్ కార్డుల తొలగింపు విషయంలో పక్షపాతం చూపారన్న ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి. ఈ కమిటీలకు సరుకుల పంపిణీని కూడా అప్పగించడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో సుమారు 8.40 లక్షల రేషన్ కార్డులు(తెలుపు, గులాబీ, ఆంత్యోదయా, అన్నపూర్ణ) ఉన్నాయి. కాగా తుపాన్, అనంతరం వచ్చిన నాగావళి, వంశధార వరదల కారణంగా 22 మండలాల్లో 196 గ్రామాలు, ఆరు మున్సిపాలిటీల పరిధిలో 13 వార్డుల్లోనూ కలిపి మొత్తం 57,127 కుటుంబాలు నష్టపోయినట్లు గుర్తించారు. ఇందులో మత్య్సకార కుటుంబాలు 33 వేలు ఉన్నాయి. తుపాను సాయం, సరుకులు మత్స్యకారులకు చాలా వరకు అందగా, మిగిలిన బాధితులకు మాత్రం అరకొరగానే అందింది.
మత్య్సకారులకు, చేనేత కార్మికులకు {పత్యేక ప్యాకేజీ
తుపాన్, వరదల్లో నష్టపోయిన మత్స్యకారులు, చేనేత కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. కుటుంబానికి 50 కిలోల బియ్యం, 5 లీటర్ల కిరోసిన్, లీటరు పామాయిల్, కందిపప్పు, పంచదార, కారం, ఉప్పు, ఇతర సరుకులతోపాటు ఉల్లిపాయలు, దుంపలు అంద జేయాలి. వీరు కాకుండా మిగిలిన బాధితులకు కుటుంబానికి 25 కేజీల బియ్యం, పామాయిల్, పంచదార, కారం, ఉప్పు కందిపప్పు, తదితర సరుకులు అందజేయాలి. మిగిలిన 7.80 లక్షల కార్డుదారులకు పింక్, తెలుపు అన్న తేడా లేకుండా కార్డుకు 10 కిలోల బియ్యం, పంచదార, పామాయిల్, కారంతోపాటుగా ఉల్లిపాయలు, బంగాళాదుంపలు అందజేయాలని ప్రభుత్వం ఆదేశాలు చేసింది.
సరఫరాలో జాప్యం
ఇప్పటివరకు జిల్లాకు 30 లారీల్లో సుబారు 480 మెట్రిక్ టన్నుల సరుకలు వచ్చాయి. ఇందులో ప్రధానంగా ఉల్లిపాయలు, బంగాళా దుంపలు ఉన్నాయి. అయితే వీటిని మండలాలకు చేరవేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కలాసీలు, రవాణా సదుపాయం లేకపోవడం కారణంగా చెబుతున్నారు. ఆదే విధంగా ఎంఎల్‌ఎస్ పాయింట్ల వద్ద సరిపడినంతగా బియ్యం నిల్వలు లేవు. దీంతో తహశీల్దార్లు మంజూరు చేసిన ఆర్‌ఓలు పట్టుకొని ఎంఎల్‌ఎస్ పాయింట్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు.