ఆందోళన బాటలో ఉపాధ్యాయులు
Published Mon, Jan 27 2014 2:24 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: జిల్లాలోని ఉపాధ్యాయులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. శ్రీకాకుళం, పాలకొండ డివిజన్లలోని ఉపాధ్యాయులను టెక్కలి డివిజన్‌కు డిప్యుటేషన్‌పై పంపాలని అధికారులు యోచిస్తుండడమే ఇందుకు కారణం. రెండు రోజుల క్రితం కలెక్టర్ సౌరభ్ గౌర్, విద్యాశాఖ కార్యక్రమాలపై సమీక్ష జరుపుతూ టెక్కలి డివిజన్‌లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని, అక్కడకు డిప్యుటేషన్లు వేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయ సంఘాలతో ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిప్యుటేషన్ల ప్రతిపాదనను ఉపాధ్యాయ సంఘాలన్నీ తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇప్పటికే ఓ సారి సడీచప్పుడు లేకుండా డిప్యుటేషన్లు వేశారని,
ఇది నిబంధనలకు విరుద్ధమని సంఘాల నేతలు పేర్కొన్నారు. మండల పరిధిలో మాత్రమే డిప్యుటేషన్లు వేయాలని ఉత్తర్వులు చెబుతుండగా, డివిజన్‌నే మార్చాలని యోచించడం తగదని స్పష్టం చేశారు. విద్యా సంవత్సరం చివర్లో డిప్యుటేషన్లు వేయడం వల్ల ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. మొండిగా వేస్తే ఆందోళన చేయకతప్పదని హెచ్చరించారు. ఈ మేరకు సంఘాలు చేసిన తీర్మానం ప్రతిని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.అరుణకుమారికి అందజేశారు. ఈ సమావేశంలో పీఆర్‌టీయూ నాయకులు వి.హరిశ్చంద్రుడు, భైరి అప్పారావు, ఏపీటీఎఫ్ నేతలు సన్నశెట్టి రాజశేఖర్, కొప్పల భానుమూర్తి, యూటీఎఫ్ నేతలు గొంటి గిరిధర్, చౌదరి రవీంద్ర, ఎస్‌టీయూ నాయకులు పేడాడ ప్రభాకరరావు, డీటీఎఫ్ నాయకులు పి.కృష్ణారావు, హెచ్‌ఎంల అసోసియేషన్ నేత ఎ.బలరామకృష్ణారావు, ఆపస్ నాయకుడు దుప్పల శివరామప్రసాద్, ఎస్‌ఎల్‌టీఏ నాయకులు పి.సూర్యనారాయణ, కె.కె.వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.
కేజీబీవీ పీఈటీలు కూడా..
శ్రీకాకుళం మున్సిపాలిటీ: కేజీబీవీల్లో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుల పనివేళల సమస్యను ఈ నెలాఖరులోగా పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామని వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం నేత మోహన్ చెప్పారు. దీనికి పీఈటీలందరూ సిద్ధం కావాలన్నారు. పట్టణంలోని శారద డిగ్రీ కళాశాల ఆవరణలో ఆదివారం నిర్వహించిన సంఘ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమతో 24 గంటలూ పనిచేయించుకోవడం దారుణమన్నారు. దీనిపై పునరాలోచన చేయాలని ఎన్నోసార్లు కోరినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో సంఘం నేతలు సీహెచ్.శ్రీనివాసరావు, ఎస్.అప్పలరాజు, వై.రామారావు, ఎల్.ఢిల్లీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement