రాజుగార్ని దువ్వుతున్న రాజుగారు
మరోసారి టీటీడీ ఛైర్మన్ పదవి చేపట్టాలని కనుమూరి బాపిరాజు మహా ఊవిళ్లూరుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో టీటీడీ పగ్గాలు వదులుకోవాల్సి వస్తుందని ఆయన ప్రస్తుతం తెగ మధనపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి టీటీడీ పాలన పగ్గాలు చేపట్టేందుకు ఆయన తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అందులోభాగంగా ఆయన ఇప్పటికే తెలుగుదేశం పార్టీలోని హేమాహేమీ నాయకులతో భేటీ అయి... స్వామీ వారికి మరోసారి సేవ చేసే 'ఒకేఒక్క ఛాన్స్' తనకు ఇప్పించాలని ప్రాధేయపడ్డారట. అయితే ఆయనకి అక్కడ తీవ్ర నిరాశ ఎదురైంది సమాచారం.
ఇప్పటికే ఆ పదవి కోసం తమ పార్టీ నేతల్లో తెగపోటీ పడుతున్నారని... ఎంత త్వరగా ఆ పదవికి రాజీనామా చేస్తే అంత మంచిదని సదరు పచ్చపార్టీ నేతలు బాపిరాజుకు హితవు పలికారని తెలిసింది. దాంతో ఆయన కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలసి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో చివరికి మిగిలిన ఒకేఒక్క ఆశ బావమరిది గోకరాజు గంగరాజు. నర్సాపురం లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరఫున తనపై పోటీ చేసి విజయం సాధించిన బావమరిది గంగరాజును బాపిరాజు ఆశ్రయించారు. ఎలాగోలా టీటీడీ ఛైర్మన్ పదవి తనకే దక్కేలా ప్రయత్నించాలని బాపిరాజు తన బావమరిది గంగరాజును దువ్వుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో కలియుగదైవం శ్రీవెంకటేశ్వరుడు బాపిరాజును కరుణిస్తాడో లేదో చూడాలి. అయితే టీటీడీ ఛైర్మన్ పదవి కోసం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చుట్టు తెలుగుతమ్ముళ్లు ప్రదక్షణాలు చేస్తున్నారని సమాచారం.