పోలీసు వలయంలో ఆ ప్రాంతాలు | Strengthening Police Mechanisms In Corona Virus Affected Areas | Sakshi
Sakshi News home page

పోలీసు వలయంలో ఆ ప్రాంతాలు

Published Sat, Apr 11 2020 8:14 AM | Last Updated on Sat, Apr 11 2020 8:14 AM

Strengthening Police Mechanisms In Corona Virus Affected Areas - Sakshi

ఇస్లాంపేట ప్రాంతంలో పర్యటిస్తున్న ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌

సాక్షి, ఒంగోలు: కరోనా వైరస్‌ ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. తాజాగా రెడ్‌ జోన్ల చుట్టూ పటిష్ట పోలీసు వలయాన్ని ఏర్పాటు చేసి ప్రధాన రహదారి వద్ద భారీ బోర్డులను ఏర్పాటు చేసింది. పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతం చుట్టూ 300 మీటర్ల వరకు రెడ్‌జోన్‌గా పేర్కొంటూ మ్యాప్‌ రూపొందించారు. ఆ ప్రాంతంలోని అన్ని రహదారులను మూసేసి.. అన్నింటిని కలిపే ఒకే ఒక్క రహదారిని తెరిచి ఉంచుతున్నారు. అక్కడ నిత్యం పోలీసులు, ఏఎన్‌ఎం, ఉపాధ్యాయ వర్గం నుంచి ఒక్కొక్కరు పికెట్‌లో ఉండేలా చర్యలు చేపట్టారు. ఆ మార్గం నుంచి వెళ్లే ప్రతి వాహనం నంబర్, మొబైల్‌ నంబర్‌ రిజిస్టర్‌ చేసుకుని బయటకు వెళ్లేందుకు వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలోని 11 ప్రాంతాలను రెడ్‌ జోన్లుగా ప్రకటించారు. చదవండి: పోలీస్‌: ‘దండం పెడుతా.. బయటకు రాకండి’


పీర్లమాన్యం వద్ద మ్యాప్‌ను పరిశీలిస్తున్న ట్రైనీ ఎస్పీ జగదీష్‌ 

ఒంగోలు నగరంలో ఈ పహారా మరింత పటిష్టంగా మారింది. ఇస్లాంపేటలో 17 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ఆ ప్రాంతం, పీర్లమాన్యంలో మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అక్కడ పనిచేసే అధికారులపై కూడా ప్రత్యేక నిఘా ఉంచారు. ఏ అధికారి ఎన్ని గంటలకు విజిట్‌ చేశారు.. అప్పటివరకు ఎన్ని వాహనాలు బయటకు వెళ్లాయి.. ఎవరెవరు బయటకు వస్తున్నారనే వివరాలు సిబ్బంది రికార్డుల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ రికార్డులను అధికారులు పరిశీలించి సంతకం కూడా చేయాలని ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ఆదేశించారు. కొంతమంది వ్యక్తులు అవసరం ఉన్నా లేకున్నా బయటకు వస్తున్న విషయం ఈ విధానం ద్వారా బహిర్గతమవుతుందని, తద్వారా సంబంధిత వ్యక్తులపై నిబంధనలు ధిక్కరించిన వారిపై కేసులు నమోదు చేస్తామని పలు రెడ్‌ జోన్‌ ప్రాంతాలను విజిట్‌ చేసిన తాలూకా సీఐ ఎం.లక్ష్మణ్‌ శుక్రవారం తెలిపారు. చదవండి: భార్యతో సైకిల్‌పై 120 కిలోమీటర్లు.. 

లాక్‌డౌన్‌లో సిబ్బంది విధులను పరిశీలించిన ఎస్పీ 
లాక్‌డౌన్‌ సందర్భంగా నగరంలో సిబ్బంది విధులను ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ శుక్రవారం సాయంత్రం స్వయంగా పరిశీలించారు. తన క్యాంప్‌ కార్యాలయం నుంచి మోటార్‌బైక్‌పై బయటకు వచ్చిన ఆయన అంజయ్య రోడ్డు, లాయర్‌ పేట, సాయిబాబా ఆలయం, ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్, కోర్టు సెంటర్, గాంధీ రోడ్డు, ట్రంక్‌ రోడ్డు, ఇస్లాంపేట, బండ్లమిట్ట, కర్నూల్‌రోడ్డులోని పలు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత ప్రాంతాల్లోని సిబ్బందితో మాట్లాడి అక్కడ ఎదురవుతున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇస్లాంపేట, బండ్లమిట్ట ప్రాంతాలను పూర్తిగా మూసివేయాలని ఆదేశించారు.     

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement