కర్నూలు(రూరల్), న్యూస్‌లైన్ : ప్రపంచంలో అరుదుగా ఉంటూ జగదేక వృక్షంగా పేరొందిన ఎర్రచందనం కోసం ఎంతకైనా తెగించే అటవీ దొంగల భరతం పట్టేందుకు ఫారెస్టు శాఖాధికారులు చర్యలు మొదలెట్టారు. ఇందులో భాగంగా స్మగ్లర్ల ఏరివేత కోసం అటవీ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. శేషాచలం అడవుల్లో ఫారెస్టు అధికారులపై స్మగ్లర్ల ఘాతుకం నేపథ్యంలో ఈ మేరకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించినట్లు కర్నూలు సర్కిల్ ఫారెస్ట్ కన్జర్వేటర్ శాంతిప్రియ పాండే తెలిపారు. ఇందుకు ఆమె ‘న్యూస్‌లైన్’కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ప్రశ్న : కర్నూలు సర్కిల్‌లో ఎర్రచందనం ఎంత పరిధిలో విస్తరించి ఉంది?
జవాబు : కర్నూలు సర్కిల్ పరిధిలోకి కడప, కర్నూలు జిల్లాలు వస్తాయి. రుద్రవరం రేంజ్‌లో 5 బీట్‌ల పరిధిలో 230 చ.కి.మీ. విస్తీర్ణంలో ఎర్ర చందనం ఉంది. కడప జిల్లా సిద్ధవఠం, బండిమెంట, రాయచూటి, వేంపల్లి రేంజ్‌లలో 1200 చ.కి.మీ., ప్రొద్దుటూరు పరిధిలో ప్రొద్దుటూరు, ఒనిపెంట, పోరుమామిళ్ల, బద్వేల్ రేంజ్‌లలో వెయ్యి కిలోమీటర్ల పరిధిలో చందనం ఉంది.
ప్రశ్న : శేషాచలం అడవుల్లో దొంగల ఘాతుకం నేపథ్యంలో ఇక్కడ తీసుకుంటున్న చర్యలేంటి?
జవాబు : స్మగ్లింగ్‌కు ప్రధాన సూత్రధారులుగా అనుమానిస్తున్న వారిపై నిఘా పెట్టాం. పోలీసుశాఖతో కలిసి నల్లమలలో సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాం. స్మగ్లర్ల వివరాల సేకరణకు ప్రత్యేక బృందాలను నియమించాం. మా శాఖ సిబ్బందితోపాటు పోలీసులు కూడా ఆయుధాలతో అడవుల్లో పర్యటిస్తూ తనిఖీలు నిర్వహిస్తున్నాం.
ప్రశ్న : అటవీ సిబ్బందికి ఆయుధాలు ఇస్తున్నారా?
జవాబు : స్మగ్లర్లు, క్రూర జంతువుల నుంచి రక్షణ కోసం అటవీ ఉద్యోగులకు ఆయుధాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 250కి పైగా ఆయుధాలు అవసరమని ప్రతిపాదించాం. రేంజర్ స్థాయివారికి రివాల్వర్, కిందిస్థాయి ఉద్యోగులకు తుపాకులు ఇస్తాం. శిక్షణ ఇచ్చిన తర్వాతే సిబ్బందికి ఆయుధాలు ఇస్తాం. ముందుగా పోలీసు అకాడమీలో ఫిట్‌నెస్ ట్రైనింగ్,, తర్వాత మూడు దఫాలుగా జిల్లాకు 70 మంది చొప్పున ఫిబ్రవరిలోపు శిక్షణ పొందేలా చర్యలు చేపట్టాం.
ప్రశ్న : ఈ ఏడాది ఎన్ని పీడీ యాక్టు కేసులు నమోదు చేశారు?
జవాబు : నంద్యాల రేంజ్ పరిధిలో నాలుగు, ప్రొద్దుటూరు రేంజ్‌లో 4, కడప రేంజ్‌లో 5 కేసులను పీడీ యాక్టు కింద ప్రతిపాదించాం. అనుమతి వచ్చిన వెంటనే నమోదు చేస్తాం.
ప్రశ్న : అక్రమ రవాణా నిరోధానికి తీసుకుంటున్న చర్యలేంటి?
జవాబు : 29 బేస్ క్యాంపులు, 9 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. చెక్‌పోస్టుల్లో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన సీసీ కెమెరాలు, జీపీఎస్ సెట్లు అమరుస్తున్నాం. అలాగే స్ట్రయికింగ్ ఫోర్స్‌తోఉన్న వాహనాలు, మూడు ప్రత్యేక పోలీసు బృందాలు పనిచేస్తున్నాయి. చెక్‌పోస్టుల్లో సోలార్ లైట్లు, స్టాపర్స్‌ను ఏర్పాటు చేయనున్నాం.
ప్రశ్న : పీడీ యాక్టు కింద కేసు నమోదైనా స్మగ్లర్లు వారంలోపే బయటకు రావడమేంటి?
జవాబు : ఎర్రచందనం స్మిగ్లింగ్ చేస్తూ ఆరు నెలల్లోపు రెండు/మూడుసార్లు పట్టుబడిన వారిపై పీడీ యాక్టు కింద కేసు పెడుతున్నాం. పీడీ యాక్టులో ఫారెస్టు అఫెండర్స్ అనే పదం లేకపోవడంతో ఈ కేసులు కోర్టు విచారణలో నిలవడం లేదు. విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఇటీవలే చట్టంలో ఆ పదాన్ని చేర్పించాం.
ప్రశ్న : ఎర్రచందనం ముఠాల నుంచి ఫారెస్టు అధికారులకు మామూళ్లు అందుతున్నాయనే ఆరోపణలున్నాయి?
జవాబు : అలాంటిదేమీ లేదు. ఉన్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
ప్రశ్న : అటవీ భూముల్లో అక్రమ మైనింగ్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
జవాబు : ప్రొద్దుటూరు రేంజ్‌లోఅక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు తెలిసింది. కర్నూలు డివిజన్ పరిధిలో కూడా కొంత మేరకు ఉంది. అధికారుల తనిఖీల్లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేశాం. అటవీ భూముల్లో కేవలం నాలుగు లీజ్‌లు మాత్రమే ఉన్నాయి.
ప్రశ్న : స్మగ్లర్లతో అధికారులు, సిబ్బంది కుమ్మక్కయ్యారనే ఆరోపణలపై మీ స్పందన ఏంటి?
జవాబు : స్మగ్లర్లతో కుమ్మక్కైనట్లు తెలిస్తే విచారించి సదరు ఉద్యోగులపై వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటివరకు ప్రొద్దుటూరు రేంజ్‌లో 8 మందితోపాటు కడప డిప్యూటీ రేంజ్ ఆఫీసర్‌ను కూడా సస్పెండ్ చేశాం. పోలీసుల పాత్ర ఉంటే సంబంధిత డీఎస్పీకి ఫిర్యాదు చేస్తున్నాం. ప్రొద్దుటూరు, కడప రేంజ్‌లో జరిగే స్మగ్లింగ్‌లో పోలీసుల పాత్ర ఉన్నట్లు ఫిర్యాదులున్నాయి.
అడవి దొంగల భరతం పడతాం
Published Wed, Jan 1 2014 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 2:09 AM
Advertisement
Advertisement