సరుకుల్లేవ్ | Strike effect on the public distribution NGOs | Sakshi
Sakshi News home page

సరుకుల్లేవ్

Published Sun, Feb 9 2014 3:50 AM | Last Updated on Sat, Sep 2 2017 3:29 AM

Strike effect on the public distribution NGOs

 ఏలూరు/నల్లజర్ల రూరల్, న్యూస్‌లైన్:రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటుకు చేరుతున్న నేపథ్యంలో ఏపీ ఎన్జీవోల పిలుపు మేరకు ఉద్యోగ సంఘాలు చేపట్టిన సమ్మె ప్రజా పంపిణీ వ్యవస్థపై ప్రభా వం చూపుతోంది. రేషన్ డిపోలకు సరుకు ల్ని విడుదల చేసే ప్రక్రియలో కీలకపాత్ర పోషించే రెవెన్యూ అధికారులు సమ్మెలో ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. స్టాక్ రిలీజ్ ఆర్డర్స్ (సరుకుల విడుదల పత్రాలు) ప్రజా పంపిణీ గోదాములకు రావటం లేదు. రేషన్ సరుకులకు సంబంధించి డీల ర్లు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో సొమ్ము చె ల్లిస్తే.. వాటిని సివిల్ సప్లైస్ డెప్యూటీ తహసిల్దార్లు (సీఎస్‌డీటీ) పరిశీలించి తహసిల్దార్ల ద్వారా సరుకుల విడుదల పత్రాలు జారీ చేస్తారు. ఈ పత్రాలను మీ-సేవా కేంద్రాల్లో తీసుకునే వెసులుబాటు ఉన్నా ఇందుకు తహసిల్దార్ల నుంచి అనుమతి అవసరం. తహసిల్దార్ నుంచి నాలుగో తరగతి ఉద్యోగి వరకూ సమ్మెలో ఉండటంతో స్టాక్ రిలీజ్ ఆర్డర్లు ఇవ్వడం లేదు. దీనివల్ల డీలర్లు డీడీలు తీసినా ప్రయోజనం లేకపోతోంది. చాలావరకు ఈనెలకు సంబంధించిన బియ్యం పంపిణీ పూర్తయినా అమ్మహస్తం సరుకులు మాత్రం రేషన్ డిపోలకు చేరలేదు. సమ్మె మరికొంత కాలం కొనసాగే పరిస్థితి ఉండటంతో ఈనెల 20 వరకు సరుకులు డిపోలకు చేరు అవకాశం లేదంటున్నారు. 
 
 గోడౌన్లకు చేరని సరుకులు
 జిల్లాలో 2,228 రేషన్ డిపోలున్నాయి. వాటిద్వారా 11 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులపై అమ్మహస్తం సరుకులతోపాటు కిలో రూపారుు బియ్యూన్ని పంపిణీ చేస్తున్నారు. ప్రతినెలా 5వ తేదీ నాటికి అమ్మహస్తం సరుకులు జిల్లాలోని 16 ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి రేషన్ డిపోలకు సరఫరా కావాల్సి ఉంది. ఇప్పటికే సరుకులు విడిపించుకోవడానికి 90 శాతం మంది డీలర్లు డీడీలు కట్టారు. విజయవాడ, గుంటూరు నగరాల నుంచి పంచ దార, కాకినాడ , రాజమండ్రి నగరాల నుంచి పామాయిల్, ఛత్తీస్‌గఢ్ నుంచి చింతపండు ప్యాకింగ్ చేసి జిల్లాకు రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ సరుకులేవీ గోడౌన్లకు చేరలేదని సమాచారం. 
 
 ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం : డీఎస్‌వో
 అమ్మహస్తం సరుకులు రేషన్ డిపోలకు చేరని విషయమై డీఎస్‌వో శివశంకరరెడ్డిని ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టామని చెప్పారు. స్టాక్ రిలీజ్ ఆర్డర్లు రాసే బాధ్యతను గోడౌన్ ఇన్‌చార్జిలకు అప్పగిస్తున్నామన్నారు. డిపోలను పర్యవేక్షించాల్సిందిగా జిల్లా పంచాయతీ అధికారి ద్వారా సర్పంచ్‌లను కోరామన్నారు. వీఆర్‌ఏల సాయంతో సరుకుల్ని డిపోలకు చేరవేస్తామని తెలిపారు. వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. కిరోసిన్ సరఫరాకు 10 రోజులు పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. డిపోలకు సరుకులు చేరక పోతే తమ దృష్టికి తీసుకు రావాలని డీలర్లకు సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement