సమ్మె సక్సెస్
- బెట్టు వీడిన ప్రభుత్వం
- రూ.11వేలు జీతం చెల్లించేందుకు అంగీకారం
- పోరాడి విజయం సాధించిన ఔట్‌సోర్సింగ్ కార్మికులు
- నేటి నుంచి విధుల్లోకి..
- 15 రోజుల సమ్మెకు తెర
విజయవాడ సెంట్రల్ : ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమస్యలపై శనివారం రాజమండ్రిలో ప్రభుత్వం సుదీర్ఘ చర్చలు జరిపింది. ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, అచ్చెంనాయుడు రెండు విడతలుగా చర్చలు జరిపారు. నగరం నుంచి ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు ఆసుల రంగనాయకులు, ఆర్.రవీంద్రనాథ్, కె.ఉమామహేశ్వరరావు వెళ్లారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కార్మికులు కోరినట్లు రూ.15,420 ఇవ్వలేమని మంత్రులు తేల్చిచెప్పారు. కనీసం రూ.12వేలు ఇవ్వాల్సిందిగా యూనియన్ నేతలు పట్టుబట్టారు.
‘గతంలో రూ.10,300 ఇచ్చేందుకు అంగీకరించాం కాబట్టి, మరో రూ.700 పెంచగలం. అంతకుమించి ఇవ్వలేమని..’ మంత్రులు చేతులెత్తేశారు. దశలవారీగా డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్మికుల భవిష్యత్ దృష్ట్యా మంత్రుల ప్రతిపాదనకు అంగీకరించామని ఏఐటీయూసీ నాయకుడు ఎ.రంగనాయకులు ‘సాక్షి’కి ఫోన్‌లో తెలిపారు.
డిమాండ్ల ఆమోదం ఇలా..
- పబ్లిక్ హెల్త్, నాన్ పబ్లిక్ హెల్త్ వర్కర్లకు నెలకు రూ.11వేలు జీతంగా చెల్లించడం.
- విజయవాడ కార్పొరేషన్, గ్రేటర్ విశాఖపట్నంకు మూడు నెలల్లో 010 ద్వారా జీతాలు చెల్లించేందుకు అంగీకారం.
- స్కిల్డ్, సెమీస్కిల్డ్ కార్మికుల జీతాల పెంపుదలపై 15 రోజుల్లో క్యాబినెట్ సబ్‌కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంటుంది.
- 16 రోజుల సమ్మె కాలానికి సంబంధించి పనితో కూడిన జీతం చెల్లించేలా ఒప్పందం.
శ్రామిక విజయం
జీతాల పెంపుదలతో పాటు పలు సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఈనెల 9వ తేదీ అర్ధరాత్రి నుంచి ఔట్‌సోర్సింగ్ కార్మికులు సమ్మెలోకి దిగారు. కాంట్రాక్ట్ కార్మికుల్ని రంగంలోకి దింపడం ద్వారా సమ్మెను విచ్ఛిన్నం చేయాలని ప్రభుత్వం ఎత్తులు వేసింది. సంఘటితంగా పోరాడిన కార్మికులు సర్కార్ ఎత్తుల్ని చిత్తుచేశారు. ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి, ధర్నాలు, ప్రదర్శనలు, మానవహారాలు, భిక్షాటన తదితర రూపాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేశారు. విపక్షాల మద్దతు కూడగట్టారు. నాలుగు రోజుల్లో విధుల్లోకి రాకుంటే కాంట్రాక్ట్ రద్దుచేస్తామంటూ ప్రభుత్వం డ్వాక్వా, సీఎంఈవై గ్రూపుల కార్మికులకు తాఖీదులిచ్చింది. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్మికులు, యూనియన్ నాయకులు, రాజకీయపక్షాల సహకారంతో కలెక్టరేట్ల ముట్టడిని హోరెత్తించారు. సమ్మె సెగ రగిలించడం ద్వారా శ్రామిక ‘శక్తి’ని చాటిచెప్పారు.
నేటి నుంచి విధుల్లోకి..
జీతాల పెంపుదలకు ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద ఔట్‌సోర్సింగ్ కార్మికులు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకొన్నారు. ఆదివారం నుంచి విధులకు హాజరవుతామని ప్రకటించారు. యూనియన్ నేతలు ప్రభుత్వంతో చర్చించేందుకు శనివారం రాజమండ్రి వెళ్లగా.. కార్మికులు మాత్రం సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద రిలేదీక్షలు చేపట్టారు. వీరికి మద్దతుగా సీఐటీయూ ఆధ్వర్యంలో యూటీఎఫ్ కార్యాలయంలో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఏపీఎన్జీవో, బ్యాంక్, రైల్వే, మెడికల్ ఎంప్లాయీస్, ఉపాధ్యాయులు, ట్యాక్స్‌పేయర్స్ అసోసియేషన్, జనవిజ్ఞాన వేదిక సభ్యులు ఇందులో పాల్గొని కార్మికుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమ్మె కథ సుఖాంతమైందని తెలుసుకున్న కార్మికులు టెంట్‌ను తొలగించి సంబరాలు చేసుకున్నారు.
అభ్యంతరకరమే..
మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ కార్మికుల విషయంలో ప్రభుత్వ వైఖరి అభ్యంతరకరంగా ఉందని ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. నామమాత్రంగానే ప్రభుత్వం జీతాలు పెంచిందని చెప్పారు. పర్మినెంట్ ఉద్యోగులు, ఇంజినీరింగ్ సిబ్బంది విషయంలో సర్కార్ అన్యాయంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. మిగితా యూనియన్లు అంగీకరించిన కారణంగానే తాము సమ్మెను విరమిస్తున్నామన్నారు.