ప్రమాద వశాత్తు కాలువలో మునిగి ఒక విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది. పాలకొల్లులోని పీఎల్‌కే పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న గొల్లపు రాజేష్(8), సూర్య, శ్రీకాంత్ ముగ్గురు విద్యార్థులు ఈత కొట్టేందుకు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం నర్సాపురం - నిడదవోలు కాలువలోకి వెళ్లారు.
గొల్లపు రాజేష్, సూర్య ముందు నీటిలోకి దిగారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో రాజేష్ నీటిలో మునిగిపోయాడు. సూర్య కూడా నీటిలో కొట్టుకుపోగా గమనించిన స్థానికులు కాపాడారు. శ్రీకాంత్ కాలువ గట్టుపైనే ఉండిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది గల్లంతైన రాజేష్ మృతదేహం కోసం గాలిస్తున్నారు. రాజేష్ విజయనగరం జిల్లాకు చెందినవాడు.