
కుమారుడి వద్ద విచారం వ్యక్తం చేస్తున్న తల్లి
ప్రకాశం, బేస్తవారిపేట: బ్లడీ.. బ్లడ్ క్యాన్సర్ ఓ విద్యార్థి గుండెలు పిండేస్తోంది. బేస్తవారిపేట మండలం మోక్షగుండానికి చెందిన తాళ్ల ఆదిలక్ష్మమ్మకు ముగ్గురు కుమారులు. భర్త రంగారెడ్డి 15 ఏళ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందాడు. ఆదిలక్ష్మమ్మ గ్రామంలోనే ఇంటింటికీ తిరిగి కూరగాయలు అమ్ముతూ పిల్లలను పెంచి పెద్ద చేసింది. ముగ్గురూ చదువులో రాణిస్తున్నారు. కష్టపడి పిల్లలను చదివించుకుంటూ పిల్లలు ఉజ్వల భవిష్యత్ అందుంకుంటారని ఆ తల్లి ఆశపడింది. ఇంతలో ఆ తల్లికి అనుకోని కష్టం వచ్చి పడింది. మూడో కుమారుడు తాళ్ల మహేశ్వరరెడ్డి బ్లడ్ క్యాన్సర్ బారినపడ్డాడు. మహేశ్వరరెడ్డి పదో తరగతి పందిళ్లపల్లె జెడ్పీ హైస్కూల్లో చదివి 9.5 జీపీఏ, ఇంటర్ గిద్దలూరు సాహితి జూనియర్ కళాశాలలో 928 మార్కులు సాధించాడు. ప్రస్తుతం డిగ్రీ తృతీయ సంవత్సరం గిద్దలూరులోని శ్రీనివాస డిగ్రీ కళాశాలలో చదువుతున్నాడు.
‘సాక్షి’ కథనంతో ఇప్పటికే పలువురి సాయం
2017లో డిగ్రీ మొదటి ఏడాదిలో ఉండగా మహేశ్వరరెడ్డి అనారోగ్యానికి గురికావడంతో హైదరాబాద్ కిమ్స్ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ బ్లడ్ క్యాన్సర్‌గా డాక్టర్లు నిర్థారించారు. గతంలోనే ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి అనేక మంది దాతలు స్పందించారు. గ్రామంలోని యువకులు సోషల్ మీడియా నుంచి విరాళాలు సేకరించారు. 2017లో దాతల సహకారంతో రూ.30 లక్షలు ఖర్చుతో వైద్యం అందించారు. అప్పటి నుంచి డాక్టర్ల పర్యవేక్షణలో రెండేళ్లుగా చికిత్స చేయించుకుంటూ చదువుకుంటున్నాడు. నెల రోజుల క్రితం వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో మళ్లీ వైద్యశాలలో చేరాడు. వ్యాధి నయం కావాలంటే మరో రూ.40 లక్షలు అవసరమవుతాయని డాక్టర్లు తెలపడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
నా బిడ్డను కాపాడండి:కూరగాయలు అమ్ముకుంటూ పిల్లలను చదివించుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నా. ప్రస్తుతం రూ.40 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో ఏం చేయాలో తెలియడం లేదు. దాతలు ముందుకొచ్చి నా కుమారుడికి జీవితాన్ని ఇవ్వాలి. నా బిడ్డకు ప్రాణం పోయండి.ఆదిలక్ష్మమ్మ, తల్లి
సాయం కోసం..తాళ్ల రంగస్వామిరెడ్డి,ఎస్‌బీఐ ఖాతా నంబర్ : 30699027626,
రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ బ్రాంచి, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ ,ఎస్‌బీఐఎన్ 0018176
Comments
Please login to add a commentAdd a comment