
టీవీ చూడొద్దని మందలిస్తే...
పోలాకి: పరీక్షలు దగ్గర పడుతున్నాయి. టీవీ చూడ్డం మానేసి బాగా చదువుకోమ్మా అని తల్లిదండ్రులు మందలించడాన్ని సహించలేని ఓ విద్యార్థిని మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రం పోలాకి గ్రామంలోని లుకలాపు వీధికి చెందిన తోనంగి సీత(16) పోలాకి బాలికోన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆదివారం సాయంత్రం ఆమె టీవీ చూస్తుండడంతో తల్లి దండ్రులు దుర్గారావు, నీలవేణి ఆమెను మందలించారు. పరీక్షలు దగ్గరపడుతున్నాయి.. టీవీ చూడవద్దు అనడంతో సీత అలకబూనింది. అనంతరం డాబా పైకి వెళ్లి కిరోసిన్ పోసుకుని ఒంటికి నిప్పంటించుకుంది. కుటుంబ సభ్యులు వెంటనే విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. 80శాతం కాలిన గాయాలతో చికిత్సపొందుతూ సోమవారం ఉదయం 8 గంటల సమయంలో సీత మృతి చెందినట్లు ఎస్‌ఐ వి.సత్యనారాయణ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.