రంగంలోకి రెండు పోలీసు బృందాలు
నూజివీడు : నూజివీడు ట్రిపుల్ ఐటీ నుంచి వెళ్లిపోయిన ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి పువ్వల కిరణ్‌ప్రసాద్ ఆచూకి కోసం పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పట్టణ ఎస్సై బోనం ఆదిప్రసాద్ నేతృత్వంలో ఒక బృందం, స్థానిక సీసీఎస్ ఎస్సై భాస్కరరావు నేతృత్వంలో మరో బృందం పలు ప్రాంతాలకు వెళ్లి విద్యార్థి కోసం గాలిస్తున్నాయి. కిరణ్‌ప్రసాద్ తన ఫోన్‌ను ట్రిపుల్‌ఐటీలోనే వదిలివెళ్లడంతో అతని ఆచూకీ కోసం పోలీసులు కష్టపడాల్సి వస్తోంది. విజయవాడతో పాటు విద్యార్థి స్వగ్రామం కలిదిండి మండలం మూలలంకకు కూడా పోలీసులు వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థి వెళ్లిపోయి రెండు రోజులైనా ఆచూకి లభ్యం కాకపోవడంతో అతని మిత్రులు, తల్లిదండ్రులు, బంధువుల ఫోన్‌లపై నిఘా ఉంచారు. ఒకవేళ ఎక్కడి నుంచైనా వారికి కిరణ్‌ప్రసాద్ ఫోన్ చేస్తే ముందు ఏ ప్రాంతంలో ఉన్నాడనేది తెలుస్తుందనే ఉద్ధేశ్యంతో ఈ దిశగా నిఘా ఉంచారు. ఫేస్‌బుక్ ఎక్కౌంట్‌లు, తను వదిలివెళ్లిన ఫోన్‌లోని వాట్సప్‌లో ఉన్న ఫోన్ నెంబర్లను కూడా పరిశీలిస్తున్నారు. ఫోన్‌ను వదిలివెళ్లిన నేపథ్యంలో ఇలా ఎందుకు చేశాడనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల ట్రిపుల్‌ఐటీలో నిర్వహించిన ఆందోళనలలో తనవంతు పాత్ర పోషించిన నేపథ్యంలో యాజమాన్యం ఏమైనా చర్య తీసుకుంటుందేమోననే భయంతో ఈ విధంగా చేశాడా అని కూడా సందేహం వ్యక్తం చేస్తున్నారు.
తల్లిదండ్రుల ఆందోళన
నిరుపేద కుటుంబానికి చెందిన కిరణ్‌ప్రసాద్ ట్రిపుల్‌ఐటీ నుంచి వెళ్లిపోవడంతో అతని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రెండు రోజులుగా స్థానిక పట్టణ పోలీసుస్టేషన్ వద్దకు వచ్చి తమ కుమారుడి ఆచూకి ఏమైనా లభ్యమైందా అని పోలీసులను ప్రాధేయపడుతున్నారు. కూలిపనులు చేసుకునే తాము తమ కుమారుడు ఇంజినీరింగ్ చదువుకుంటున్నాడంటే ఎంతో ఆనందపడ్డామని, ఇంతలో ఇలా జరగడమేమిటని కన్నీటిపర్వంతమవుతున్నారు. వీరితో పాటు తమ్ముడు కూడా ఆవేదన చెందుతున్నాడు. ఎక్కడున్నా తల్లి ఆరోగ్యం సరిగా లేనందున వెంటనే ఇంటికి వచ్చేయాలని తండ్రి దుర్గారావు, తమ్ముడు రాజ్‌కుమార్ ప్రాధేయపడుతున్నారు.
లభ్యం కాని ట్రిపుల్‌ఐటీ విద్యార్థి ఆచూకీ
Published Sun, Mar 15 2015 4:13 AM | Last Updated on Sat, Sep 2 2017 10:51 PM
Advertisement
Advertisement