
బస్సుల కోసం విద్యార్థుల నిరసన
బస్సులు చాలటం లేదని, కొత్తగా సర్వీసులు నడపాలని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవటం లేదంటూ విద్యార్థులు రోడ్డెక్కారు.
రొంపిచర్ల: బస్సులు చాలటం లేదని, కొత్తగా సర్వీసులు నడపాలని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవటం లేదంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మండలంలోని విప్పర్ల, రెడ్డిపాలెం, దారావారిపాలెం, కొత్తపల్లి తదితర గ్రామాలకు చెందిన 400 మంది విద్యార్థులు నిత్యం నరసరావుపేట పట్టణానికి రాకపోకలు సాగిస్తుంటారు.
అయితే, ఆర్టీసీ బస్సులు వేళకు రాక, వచ్చినా సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారు సోమవారం ఉదయం విప్పర్ల వద్ద అద్దంకి- నార్కట్‌పల్లి జాతీయరహదారిపై బైఠాయించారు. పది గంటల వరకు ఆందోళన కొనసాగటంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు విద్యార్థినీ విద్యార్థులను లాఠీచార్జితో చెదరగొట్టారు. రాకపోకలను పునరుద్ధరించారు.