
గేట్‌లో ఏపీ విద్యార్థి టాప్
- వైఎస్సార్ జిల్లాకు చెందిన చంద్రకాంత్‌రెడ్డికి మొదటి ర్యాంక్
- బాసర ట్రిపుల్‌ఐటీ విద్యార్థి ప్రశాంత్‌కి 65వ ర్యాంక్
సాక్షి, హైదరాబాద్/ఆర్మూర్, రాయచోటి: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)-2015 ఫలితాల్లో జాతీయ స్థాయిలో వైఎస్సార్ జిల్లా రాయచోటికి చెందిన విద్యార్థి చంద్రకాంత్‌రెడ్డి జియో ఫిజిక్స్ విభాగంలో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. అతని తల్లిదండ్రులు రాణెమ్మ, మునిరెడ్డి ఇద్దరూ ఉపాధ్యాయులే. ఇక గురువారం విడుదలైన ఈ ఫలితాల్లో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి ప్రశాంత్ ఈసీఈ విభాగంలో జాతీయ స్థాయిలో 65వ ర్యాంకు సాధించాడు.
ప్రశాంత్ 100 మార్కులకుగాను 69 మార్కులు పొందాడు. ఇతనితోపాటు మరో 30 మంది ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు ర్యాంకులు సాధించినట్లు తెలిసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన శ్రీనితిన్ సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో 132వ ర్యాంకు సాధించాడు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన శ్రీనితిన్ 67.27 శాతం, 832 మార్కులతో ఈ ర్యాంకు సాధించారు.
దేశవ్యాప్తంగా జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14 వరకు పలు తేదీల్లో నిర్వహించిన గేట్ పరీక్షలకు తెలంగాణ నుంచి 30 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు ఫలితాల స్కోర్ కార్డులను 27 నుంచి 29 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఐఐటీ కాన్పూర్ ప్రకటించింది.