ఎల్లారెడ్డి టౌన్, న్యూస్‌లైన్ :
ప్రతి మనిషి జీవితంలో విద్యార్థి దశ ఎంతో కీలకమని, భవిష్యత్తుకు చక్కని పునాది వేసుకునేది ఆ దశలోనే అని జిల్లా అదనపు జేసీ శేషాద్రి అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్‌డే కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఇంటర్మీడియట్ స్థాయిలో ప్రతి ఒక్కరికీ ఆలోచించుకునే శక్తి ఉంటుం దని, ఎటు వైపు వెళ్లాలన్నా ఎంచుకునేందుకు సరైన సమయమన్నారు. మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, భవిష్యత్తుపై దృష్టి సారించి లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలని సూచించారు. కొత్తగా కళాశాలల్లో చేరిన విద్యార్థుల్లో భయాన్ని తొలగించేందుకు ఇలాంటి ఫ్రెషర్స్‌డేలు ఎంతో దోహదపడుతాయన్నారు. అనంతరం డీవీఈవో అందె జీవన్‌రావు మాట్లాడుతూ మనిషి మెదడు వంద సూపర్‌ఫాస్ట్ కంప్యూటర్లతో సమానమని, ఎన్నో విషయాలను అందులో నిక్షిప్తం చేసుకోవచ్చన్నారు. 300 సంవత్సరాలకు సరిపడా జ్ఞాపకశక్తిని మనిషి మెదడులో కలిగి ఉంటుందని పేర్కొన్నారు.
విద్యార్థులు సంయమనంతో చదువుకొని రాచబాట వేసుకోవాలన్నారు. ఎదిగిన కొద్ది ఒదిగి ఉండాలన్నారు. అనంతరం డిప్యూటీ కలెక్టర్ దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత ఆధునిక యుగంలో చాలా మంది టీవీల్లో ప్రసారమయ్యే సీరియళ్ల వైపు మొగ్గి సమయాన్ని వృథా చేసుకుంటున్నారని అన్నారు. ఇళ్లల్లో ఉన్నంత సమయంలో టీవీల వైపు వెళ్లకుండా విజ్ఞానాన్ని సాధించే చానళ్లను ఎంచుకోవాలన్నారు. ఫ్రెషర్స్‌డే నిర్వహించుకోవడం వల్ల విద్యార్థినీ విద్యార్థుల్లో సోదరభావం పెంపొందుతుందన్నారు.
చిందేసిన అదనపు జేసీ, డీవీఈవో...
కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి అదనపు జేసీ శేషాద్రి, డీవీఈవో జీవన్‌రావు, కళాశాల ప్రిన్సిపాల్ మధుకర్ చిందులేశారు. ఉత్సాహంగా.. ఉల్లాసంగా... పలు గేయాలపై విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేశారు. ఫ్రెషర్స్‌డేలో పాల్గొనేందుకు వచ్చిన రేలారే ఫేం గంగ పలు గేయాలతో విద్యార్థులను ఉత్తేజపర్చారు.
విద్యార్థి దశ ఎంతో కీలకం
Published Sat, Sep 7 2013 2:13 AM | Last Updated on Fri, Sep 1 2017 10:30 PM
Advertisement
Advertisement