సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ వెబ్ కౌన్సెలింగ్‌లో విద్యార్థులు నాణ్యతకే పెద్దపీట వేశారు. కేవలం రూ. 30 వేల ఫీజు ఉన్న కళాశాలలకు ఒకటి రెండు అడ్మిషన్లు మాత్రమే వచ్చాయి. ఆయా కళాశాలల్లో నాణ్యత లేదని భావించిన విద్యార్థులు వాటి జోలికి వెళ్లలేదని సీట్ల కేటాయింపు జాబితాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక లక్ష రూపాయల వరకు ఫీజు ఉన్న కళాశాలల్లోనూ పూర్తి సీట్లు నిండాయి. మరోవైపు సీమాంధ్ర ప్రాంత విద్యార్థులు ఈ ఏడాది హైదరాబాద్‌లోని కళాశాలలను ఎంచుకునేందుకు ఇష్టపడలేదని జాబితాలను బట్టి స్పష్టమవుతోంది. 20 శాతం ఓపెన్ కేటగిరీలో ఏయూ, ఎస్వీయూ రీజియన్ల విద్యార్థులు కొన్ని అగ్రశ్రేణి కళాశాలల్లో మాత్రమే సీట్లు ఎంచుకున్నారు. రాజధాని నగరంలో సైతం నాణ్యమైన కళాశాలలను మాత్రమే విద్యార్థులు ఆదరించారు.
ఈ ఏడాది 60 ప్రైవేటు కళాశాలల్లో, 34 యూనివర్సిటీ కళాశాలల్లో మొత్తం సీట్లు నిండగా... 256 కళాశాలల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారింది. తొలివిడత కౌన్సెలింగ్ అనంతరం గణాంకాలను విశ్లేషించగా.. 256 కళాశాలల్లో 0 నుంచి 100లోపు సీట్లు భర్తీ అయ్యాయి. అందులో ఒక్క సీటు కూడా భర్తీ కాని కళాశాలలు 13 కాగా... 5 సీట్ల లోపు భర్తీ అయిన కళాశాలలు 20. మొత్తంగా 103 కళాశాలల్లో 30 లోపు సీట్లు మాత్రమే భర్తీ కావడం గమనార్హం.
రాష్ట్రంలో ఈ ఏడాది తొలి విడత కౌన్సెలింగ్‌లో 609 ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు, 34 యూనివర్సిటీ కళాశాలలు పాల్గొనగా.. వాటిలో 100 సీట్లలోపు భర్తీ అయినవి 256 కళాశాలలు, 150లోపు సీట్లు భర్తీ అయినవి 335 కళాశాలలు ఉన్నాయి. అంటే సగానికి పైగా ప్రైవేటు కళాశాలల భవితవ్యం అంధకారంలో పడింది. తక్కువ అడ్మిషన్లు పొందిన కళాశాలల విద్యార్థులు తర్వాతి విడత కౌన్సెలింగ్‌లో మరింత మంచి కళాశాల కోసం ప్రయత్నిస్తే.. వాటి పరిస్థితి మరీ దారుణంగా మారనుంది. దాంతో ఒక్క సీటు కూడా భర్తీకాని కళాశాలల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
అగ్రశ్రేణి కళాశాలల్లో ఇలా: కనీసం 50 శాతం సీట్లు భర్తీ అయితేనే ఆయా కళాశాలలు మనుగడ సాధించేందుకు అవకాశం ఉంటుందని పలు యాజమాన్య సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. ఆ లెక్కన కనీసం 150 పైగా సీట్లు భర్తీ కావాలి. దీన్ని బట్టి చూస్తే దాదాపు 300 క ళాశాలల పరిస్థితి మాత్రమే మెరుగ్గా ఉంది. 151 నుంచి 200 సీట్ల వరకు 70 కళాశాలలు, 201 నుంచి 250 మధ్య 49 కళాశాలలు, 251 నుంచి 300 సీట్ల వరకు 41 కళాశాలల్లో భర్తీ అయ్యాయి. ఇక 500పైన సీట్లు భర్తీ అయిన కళాశాలలు 56 ఉన్నాయి. ఈ ఏడాది కాస్త ప్రమాణాలున్న అగ్రశ్రేణి కళాశాలల్లో మాత్రమే 50 శాతానికంటే ఎక్కువ సీట్లు భ ర్తీ అయ్యాయి. దాదాపు 60 ప్రైవేటు కళాశాలల్లో మొత్తం సీట్లు భర్తీ అయ్యాయి.
కళాశాలలు ఏమంటున్నాయంటే: ‘‘రూ. 35 వేల ఫీజు ఉన్న కళాశాలల్లో 75 శాతం సీట్లు నిండితే తప్ప వాటికి మనుగడ ఉండదు. జీతాలు చెల్లించడం, ప్రమాణాలతో బోధించడం సాధ్యపడదు’’ అని శ్రీదత్తా ఇంజనీరింగ్ విద్యాసంస్థల చైర్మన్ జి.పాండురంగారెడ్డి అభిప్రాయపడ్డారు. ‘‘కన్వీనర్ కోటా సీట్లు మాత్రమే భర్తీ అయితే సరిపోదు.
యాజమాన్య కోటా సీట్లు కూడా భర్తీ అయితేనే కళాశాలలు అత్యుత్తమ ప్రమాణాలతో పనిచేసే పరిస్థితి ఉంటుంది..’’ అని సీఎంఆర్ గ్రూప్ కార్యదర్శి సి.హెచ్.గోపాల్‌రెడ్డి చెప్పా రు. ‘‘హైదరాబాద్‌లో ఉన్న మా గ్రూప్ కళాశాలల్లో సీట్లు పూర్తిగా భర్తీ అయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కళాశాలల్లో కొన్ని సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. ఈ ఏడాది గ్రామీణ ప్రాంతాల్లోని అనేక కళాశాలల్లో కన్సల్టెన్సీల ద్వారా సీట్లను భర్తీ చేశారు. రవాణా ఉచితం, హాస్టల్ వసతి ఉచితం అంటూ ఎరచూపారు. చివరకు ఇలాంటి పద్ధతులు ఆయా కళాశాలలకే కష్టాలను తెచ్చిపెడతాయి..’’ అని అనురాగ్ గ్రూప్ కళాశాలల చైర్మన్ రాజేశ్వర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
కారణాలేమిటి?
చాలా ఇంజనీరింగ్ కళాశాలల్లో నాణ్యతా ప్రమాణాలు లేవని టాస్క్‌ఫోర్స్ తనిఖీల్లో వెల్లడవడం
195 కళాశాలలకు తాత్కాలిక ఫీజును రూ. 30 వేలుగా నిర్ణయించడం. ఆ కళాశాలల్లో నాణ్యత లేదని విద్యార్థులు భావించడం
ఇంజనీరింగ్‌లో ఉత్తీర్ణత నామమాత్రంగా ఉండడం
ఉపాధి తగ్గిపోయి ఇంజనీరింగ్ కోర్సులపై విద్యార్థులకు తగ్గిపోయిన మోజు
ఐటీ వంటి విభాగాలకు తగ్గిన ఆదరణ
రాష్ట్రంలో ఏటా అక్టోబర్ వరకు తరగతులు ప్రారంభం కాక విద్యార్థులు పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్లడం
కళాశాలల్లో అత్యుత్తమ బోధనా సిబ్బంది లేకపోవడం.