తాండూరు టౌన్, న్యూస్‌లైన్ : రాయల తెలంగాణ వద్దే వద్దు...పది జిల్లాల తెలంగాణే ముద్దు అంటూ విద్యార్థులు నినదించారు. కేంద్ర ప్రభుత్వం రాయల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలిస్తున్నదంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో, దాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పట్టణంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండు సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రోహిత్ రెడ్డి మాట్లాడుతూ సీడబ్ల్యూసీ తీర్మానంలో రాయల తెలంగాణ ప్రస్తావనే లేదని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనను ముందుకు తెచ్చి తెలంగాణ ప్రజల మనోభావాలతో ఆటలాడుకుంటోందని దుయ్యబట్టారు.
వెయ్యిమందికి పైగా తెలంగాణ బిడ్డలు ప్రాణాలు అర్పించింది పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం కోసమేనని అన్నారు. ఇప్పుడు కర్నూలు, అనంతపురం జిల్లాలను కలిపి తెలంగాణ ఇస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. టీఆర్‌ఎస్ జిల్లా సలహాదారు రంగారావు మాట్లాడుతూ రాయల తెలంగాణ ప్రతిపాదనను కేంద్రం విరమించుకోవాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి విజయ్ మాట్లాడుతూ ఎలాంటి ఆంక్షలు లేకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పట్టణ అ ధ్యక్షుడు అయూబ్‌ఖాన్, నాయకులు మహేందర్, వీరమణి, నబీ, వెంకటేశ్‌చారి, మోయిజ్, వెంకట్, రఘు పాల్గొన్నారు.
రాయల తెలంగాణకు ఒప్పుకోం
శంకర్‌పల్లి: రాయల తెలంగాణను ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకునే ప్రసక్తే లేదని టీఆర్‌ఎస్వీ జిల్లా అధికార ప్రతినిధి లక్ష్మీనర్సింహారెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహ స్పష్టం చేశారు. హైదరాబాద్ సహా పది జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. చౌరస్తాలో మానవహారం ఏర్పాటు చేసి రాస్తారోకో చేశారు. అనంతరం లక్ష్మీనర్సింహారెడ్డి, నర్సింహ మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం తెలంగాణ విషయంలో రోజుకో ప్రతిపాదన ముందుకు తెస్తూ ప్రజల్లో అందోళన రేకెత్తిస్తోందని విమర్శించారు. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై జరుగుతున్న జాప్యానికి నిరసనగా గురువారం చేపట్టిన బంద్‌ను తెలంగాణవాదులు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా కార్యదర్శి పండిత్‌రావు, టీఆర్‌ఎస్ యూత్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు నర్సింహారెడ్డి, బస్వరాజ్, కొండ మాణయ్య పాల్గొన్నారు.
రాయల తెలంగాణ వద్దే వద్దు
Published Thu, Dec 5 2013 12:56 AM | Last Updated on Fri, Nov 9 2018 4:51 PM
Advertisement