మార్కులు రాలేదని, చదువుతున్న కార్పొరేట్ కళాశాలల్లో స్టడీ టార్చర్ భరించలేకపోతున్నామని ఆవేదనగా లెటర్‌లు రాస్తూ కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కార్పొరేట్ విద్యా మాయాజాలంలో విద్యార్థి చిన్నపాటి సమస్యను కూడా తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో గడిచిన నెలలో 50 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ క్రమంలో పలువురి విద్యార్థులు, నిపుణుల మనోగతం ఇలా..
విద్యార్థులపై ఒత్తిడి ఇలా..
⇒ కార్పొరేట్ విద్యా సంస్థల్లో తెల్లవారుజాము నుంచి రాత్రి వరకూ చదువు తప్ప మరో వ్యాపకానికి చోటు ఉండదు. దాదాపుగా ఏ కార్పొరేట్ పాఠశాల, కళాశాలలో ఆటస్థలం అనేది కనిపించదు. దీంతో విద్యార్థులకు ఆట విడుపు ఉండడం లేదు.
⇒ ఇంజినీరింగ్, మెడిసిన్, ఐఐటీ వంటివి మాత్రమే చదువులుగా భావించే తల్లిదండ్రుల గాబరా వల్ల ఒత్తిడికి గురయ్యే విద్యార్థులూ ఉన్నారు. తమకు ఇష్టంలేని కోర్సుల్లో తల్లిదండ్రుల ఒత్తిళ్లతో చేరి, చదవలేక జాగారిపోతున్నారు.
⇒ కుటుంబ సంబంధాలు పటిష్టం కావాల్సింది పోయి, ఎవరిదారి వారిదే అన్నట్టుగా పరిస్థితి తయారైంది. దీంతో ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై ఓదార్పు కరువైంది. కష్టాన్ని ఎవరితోనూ చెప్పుకోనిస్థితిలో సగటు విద్యార్థి మనసు గతి తప్పుతోంది.
⇒ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం తాలూకూ సోషల్ నెట్‌వర్క్, ఆన్‌లైన్ పరిచయాలతో ప్రేమలు, అవి విఫలం చెందడంతో ప్రాణాలు తీసుకుంటున్న వారూ ఉన్నారు. బాలికల కిడ్నాప్‌లు, ప్రేమపేరుతో పెద్దలకు దూరంగా వెళ్లిపోవడం నిత్యకృత్యమైపోయింది.
⇒ ఆత్మహత్యకు పూనుకునే తతంగాన్ని రికార్డు చేసి యూట్యూబ్‌ల్లోనూ, వాట్సాప్‌ల్లోనూ అప్‌లోడ్ చేస్తున్న ఘటనలు ప్రేరేపితం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా అశ్లీలత, తప్పుదోవ పట్టించే పోస్టింగ్‌లు నిండిపోవడంతో సగటు విద్యార్థికి మార్గనిర్దేశం చేసే వారు కరువయ్యారు.
⇒ ఇటీవల కాలంలో సినీ హీరోల అభిమానం కూడా వెర్రితలలు వేస్తోంది. సినీ హీరోల అభిమానం అంటూ విద్యాసంస్థల్లో కులాలు వారీగా విద్యార్థులు విడిపోయి గ్రూపులు కడుతున్నారు.
వికాసం లేని విద్య అనర్థం
ఏ కార్పొరేట్ కాలేజ్‌ను తీసుకున్నా ఎక్కడా ఆటస్థలం ఉండదు. ఇక విద్యార్థుల్లో వికాసం ఎక్కడ ఉంటుంది. తెల్లవారు జాము నుంచి రాత్రి వరకూ చదివించడం, బట్టీ పట్టించడం. విద్యార్థుల కోరికలు, లక్ష్యాలు బాధలు చెప్పుకుందామన్నా సమయం దొరకదు. పక్కన స్నేహితుడు కూడా ఉండడు. దీంతో సోషల్ మీడియా ఉచ్చులో పడుతున్నారు. వికాసం లేని విద్య ద్వారా ఉపయోగం ఉండదు. సమస్యలను తట్టుకునే ఆత్మస్థైర్యం రాదు.
–ఫ్రొఫెసర్ చినిమిల్లి శ్రీనివాస్, వ్యక్తిత్వ వికాస నిపుణుడు
మానసిక ఒత్తిడితో చాలా ప్రమాదం
మానసిక ఒత్తిడితో చాలా ప్రమాదం. ఆత్మహత్యలు చేసుకోవడమే కాదు. చిన్న వయస్సులోనే దీర్ఘకాల రోగాల బారిన పడే అవకాశం ఉంది. ఇప్పుడు 18, 20 ఏళ్ల పిల్లలు కూడా బీపీ, షుగర్ లాంటి వ్యాధులకు గురై మావద్దకు వస్తున్నారు. దీంతో వారి జీవితకాలం కూడా తగ్గిపోతోంది. తల్లిదండ్రులు పిల్లలను వత్తిడికి గురిచేయకూడదు.–డాక్టర్ సీహెచ్ అప్పాజీ, ఎండీ గుండెవ్యాధి నిపుణుడు
కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమే కారణం
కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైంది. కష్టం వస్తే విద్యార్థి చిన్నాన్నకో, పెద్దమ్మకో చెప్పుకోలేని పరిస్థితి. వ్యక్తిత్వ వికాసానికి ప్రత్యే కోర్సులు పెడుతున్నారు. ఇంట్లో తాతయ్య, నానమ్మల కంటే గొప్ప వ్యక్తిత్వ వికాస విపుణులు ఉన్నారా? సమాజం ఇప్పటికైనా మేల్కొనాలి. విద్యార్థుల్లో పుస్తక పఠనం తగ్గిపోయింది. పుస్తకాలు చదివితే మానసికంగా బలంగా, దృఢంగా తయారవుతారు. –సీహెచ్ రెడ్డప్పధవేజీ, ఆధ్యాత్మిక వేత్త, నరసాపురం
పిల్లల కదలికలపై నిఘా ఉంచాలి
ఇంటర్నెట్ ప్రభావం విద్యార్థులపై చాలా ఎక్కువగా ఉంది. చదువుల వత్తిడి తాలూకా ఆత్మహత్యలు ఒకకోణం. అయితే ఇటీవల కొందరిలో నేరప్రవృత్తి కూడా పెరిగిపోతోంది. విలాసాలు, ఖర్చులకు అలవాటు పడిన విద్యార్థులు దొంగతనాలకు కూడా పూనుకుంటున్నారు. తల్లితండ్రులు విద్యార్ధుల కదలికలపై నిఘా ఉంచాలి. లేదంటే చేయి దాటిపోతారు. –ఎం.సుబ్బారావు, సీఐ నరసాపురం
ఆందోళన కలిగిస్తోన్న ఆత్మహత్యలు
విద్యార్థుల వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల బాలికల కిడ్నాప్‌లు, అత్యాచారాలు కూడా ఎక్కువైపోయాయి. వీటిని అరికట్టడానికి అందరూ నడుం బిగించాలి. విద్యార్థులపై వత్తిడి లేకుండా చూడటం, సామాజిక మాధ్యమాలను కట్టడి చేయడం చేయాలి. ముఖ్యంగా చదువుతో పాటు కళాశాలల్లోనే విద్యార్థులకు ఈ విషయాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. –డాక్టర్ ఎస్.రాజ్యలక్ష్మి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు
Comments
Please login to add a commentAdd a comment