‘నన్నెందుకిలా మోసం చేశావ్?.. నా జీవితాన్ని నాశనం చేశావ్..!’ అంటూ ఇటీవల ఇరగవరం మండలం అర్జునుడుపాలెం గ్రామానికి చెందిన ఓ నర్సింగ్ విద్యార్థిని లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ విఫలమై ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టుగా భావిస్తున్నారు. ఇలా ప్రేమ.. ఆకర్షణ రెండింటికీ మధ్య సన్నని గీతను టీనేజ్ పిల్లలు గ్రహించలేక జీవితాన్ని ఆదిలోనే ముగించేసుకుంటున్న సంఘటనలెన్నో! ఈ ఏడాది జిల్లాలో సుమారు 56 ఆత్మహత్యల కేసులు నమోదైతే వాటిలో ప్రేమ విఫలమై మరణించిన వారు దాదాపు 22 మంది.
భీమవరం: ప్రేమ.. ఆకర్షణ రెండింటికి మధ్య ఉన్న సన్నని గీతను టీనేజ్ పిల్లలు గ్రహించలేకపోతున్నారు. అదే చాలా మందిని పెడదోవ పట్టిస్తోంది. ప్రేమ మోజులో కన్న తల్లిదండ్రుల ఆశలను ఆడియాశలు చేయడం, చదువుపై దృష్టి పెట్టలేకపోవడం, ఒక లక్ష్య సాధన దిశగా అడుగులు వేయకపోవడం వల్ల ఎన్నో జీవితాలు ఆవిరైపోతున్నాయి. ఈ కోవకు చెందినదే ఇరగవరం మండలం అర్జునుడుపాలెం గ్రామానికి చెందిన నర్సింగ్ విద్యార్థిని మల్లిపూడి హెప్సిబారాణి ఆత్మహత్య. కుటుంబంలో తల్లిదండ్రుల దగ్గర ప్రేమ రాహిత్యం వల్ల కుటుంబంలో పొందలేని ప్రేమ బయట దొరుకుతుందనే ఆశపడి రోమియోల వలలో చిక్కుకుంటున్నారు.
ఆ తర్వాత ఇంట్లో వాళ్లు పెళ్లికి నిరాకరించారనో, కులం, మతం, అంతస్తు సామాజిక పరిస్థితుల్లో వ్యత్యాసం కారణంగానో సమస్య ఉత్పన్నమవుతోంది. అంతేకాకుండా ప్రేమపేరుతో వంచించి అమ్మాయిలతో శారీరక సంబంధాలు పెట్టుకోవడం, మోజు తీరిపోయిన తరువాత ముఖం చాటేయడంతో అసలు సమస్య ప్రారంభమవుతుంది. పెళ్లి చేసుకుంటానని శారీరక వాంఛలు తీర్చుకున్న తర్వాత చులకనగా మాట్లాడడం వంటి సంఘటనలను అమ్మాయిలు తట్టుకోలేకపోతున్నారు.
ఆత్మహత్యకు దారితీసే పరిస్థితులు
- మీడియా, సినిమాల ప్రభావం కూడా యువతపై ఎక్కువగానే ఉంది. సినిమాల్లో జరిగిన ఘటనలు నిజజీవితాన్ని అన్వయించుకోవడం సమస్యగా మారుతోంది.
- కాలేజ్‌లో ప్రేమ పేరుతో కొన్ని రోజులు ఒక అమ్మాయితో గడిపి తర్వాత బ్రేకప్ చెప్పి మరో అమ్మాయితో ప్రేమాయణం సాగించడం వంటి విషయాలను అమ్మాయిలు తట్టుకోలేకపోతున్నారు.
- ప్రేమపేరుతో తనకు జరిగిన అన్యాయాన్ని ఇంట్లో చెప్పే ధైర్యం లేకపోవడం, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగై పోవడంతో కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు సన్నగిల్లడంతో యువతులకు ఓదార్పు కరువవుతోంది. ఒంటరితనం, ఆత్మన్యూనతాభావం పెరిగి సమస్యగా మారుతోంది.
- సమస్యను తట్టుకునే శక్తి లేక పోవడం, క్లిష్ట సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియకపోవడంతో అయోమయ పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
- ప్రేమించినోడు మోసం చేశాడనో, తనకు కావాల్సిన వాడు దూరమవుతున్నాడనో, పెళ్లికి ఇంట్లో వాళ్లు నిరాకరించారనో క్షణికావేశంలో నిర్ణయం తీసుకుంటున్నారు.
- ఎన్నో ఆశలు పెట్టుకుని పెంచిన తల్లిదండ్రులు, భవిష్యత్ జీవితంపై వీరికి కనీస అవగాహన లేకపోవడం ఇలాంటి సమస్యలకు దారి తీస్తోంది.
- చదువుకునే సమయంలో ఒక లక్ష్యసాధన దిశగా విద్యనభ్యసించకపోవడం, ఏదిమంచి, ఏది చెడు అన్న విచక్షణ కోల్పోవడం, ప్రేమకు ఆకర్షణకు తేడా తెలియకపోవడం, చిన్న చిన్న ప్రలోభాలకు లొంగిపోవడం, జీవితంపై అవగాహన లేకపోవడం వంటి విషయాలు యువతను ప్రేమ వలయంలోకి నెట్టేస్తోంది.
- ఒక్కసారి పరిణితితో కూడిన ఆలోచన చేయాలి. బంగారు భవిష్యత్‌పై గంపెడాశలతో చదువును అభ్యసించాలి. ఒక లక్ష్యసాధన దిశగా చదువుకోవాలి. డిగ్రీ అయ్యే వరకూ కష్టపడి చదివితే జీవితమంతా బంగారుమయం అన్న సంగతి గ్రహించాలి. చదువుకునే సమయంలో ప్రేమ పేరుతో వంచన చేసుకుంటే జీవితమంతా చీకటిమయం అన్న సంగతి యువత గ్రహించాలి.
తల్లిదండ్రులు పిల్లలతో స్నేహభావంతో మెలగాలి
తల్లిదండ్రులు పిల్లలతో స్నేహభావంతో మెలగాలి. పిల్లలతో బంధాలను బలపర్చుకొనే విధంగా వ్యవహరించాలి. పిల్లలు ఏ విషయాన్నైనా తల్లిదండ్రులతో స్వేచ్ఛగా చెప్పుకునే స్వాతంత్య్రం కల్పించాలి. గోప్యత లేకుండా ఉంటే సమస్య చాలా వరకు తీరుతుంది. హెల్ప్ లైన్ ద్వా రా కౌన్సిలింగ్ తీసుకుంటే చాలావరకూ పరిష్కారం దొరుకుతుంది. టీనేజ్ పిల్లల్లో ఎక్కువగా బోర్డర్‌లైన్ పర్సనాల్టీ డిజార్డర్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఒంటరిగా ఉండడం, ఎవరితోనూ మాట్లాడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే మానసిక వైద్య నిపుణులను సంప్రదించాలి. –డాక్టర్ జీవీ రమణరావు, మానసిక వైద్య నిపుణుడు, భీమవరం
తల్లిదండ్రుల ధోరణి మారాలి
నేటి సమాజంలో ఎక్కువ మంది విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల వ్యవహారశైలిని పట్టించుకోవడం లేదు. వారి బిజీ జీవితంలో పిల్లలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు ప్రేమ వ్యవహారాల్లో ఫెయిల్ అయినప్పుడు ఎవరికీ చెప్పుకోవాలో తెలియక ఆత్మహత్మకు పూనుకుంటున్నారు. విద్యార్థులకు చిన్న తనం నుంచి ఓటమి, విజయాలను సమానంగా స్వీకరించే విధంగా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి. –ఫ్రొఫెసర్ కేవీఎస్‌ఎన్ రాజు, ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల, భీమవరం
మానసిక ఒత్తిడితోనే ఆత్మహత్యలు
నేటి పోటీ ప్రపంచంలో విద్యాభ్యాసంలో విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇదే సమయంలో ఎక్కువమంది స్నేహాన్ని ప్రేమగా భ్రమిస్తున్నారు. తనతో ప్రేమగా మాట్లాడే యువకుడు మరొకరితో స్నేహంగా మాట్లాడితే తట్టుకోలేక తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. – ఎం.రవిచంద్ర, ఇంజినీరింగ్ విద్యార్థి
జీవితంలో స్థిరపడితేనే ప్రేమకు అర్థం
చదువుకునే రోజుల్లో ప్రేమ వ్యవహారాల జోలికి వెళ్లకూడదు. చదువు పూర్తిచేసుకుని జీవితంలో స్థిరపడిన తరువాత ప్రేమలో పడినా పెళ్లి అనంతరం వారి కాపురాలు సజావుగా సాగిపోతాయి. – ఎన్.దుర్గారావు, తృతీయ సంవత్సరం ఇంజినీరింగ్ విద్యార్థి
స్పోర్టివ్‌గా తీసుకోవాలి
విద్యార్థులు దేనినైనా స్పోర్టివ్‌గా తీసుకునే విధంగా రాటుదేలాలి. చదువుపై దృష్టిపెట్టకుండా ప్రేమ వ్యవహారాలు నడిపితే నష్టపోవడం సహజం. విద్యార్థుల మధ్య ప్రేమ సోదరభావంగా ఉంటే మంచిది. – ఫ్రొఫెసర్ డీవీఆర్ మోహన్, ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల
Comments
Please login to add a commentAdd a comment