
రాజోలు: మోటారు సైకిల్‌పై వస్తాడు.. దానిలో ఉన్న పెట్రోలను కవర్‌లోకి తీసుకుంటాడు. సమీపంలో ఉన్న తాటాకిళ్లపైకి దానిని విసిరి నిప్పుపెడతాడు. అంతేకాదు. ఇంటికి నిప్పంటుకుందని ఆ ఇంటిలో ఉన్న వాళ్లను అప్రమత్తం చేస్తాడు. సహాయం చేస్తున్నట్టుగా నటిస్తాడు. వాళ్లు తమ వస్తువులను కాపాడుకునే హడావుడిలో ఉండగా.. ఇతడు వాటిని దొంగిలించే పనిలో ఉంటాడు.. ఇలా డబ్బు, బంగారం దొంగతనం కోసం తాటాకిళ్లు లక్ష్యంగా చేసుకుని వాటిని దహనం చేస్తున్న యువకుడిని సోమవారం రాజోలు పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గత నెలలో రాజోలు పోలీస్‌స్టేషన్ పరిధిలోని శివకోడు, రాజోలు గ్రామాల్లో ఐదు తాటాకిళ్లకు నిప్పుపెట్టాడు భీమవరానికి చెందిన ఈ యువకుడు.
రాజోలు, తదితర ప్రాంతాలకు మోటార్‌సైకిల్‌పై రాత్రి సమయాల్లో వచ్చి మోటార్‌సైకిల్‌లోని పెట్రోలును ఒక కవర్‌లోకి తీసుకుని దానిని తాటికిళ్లపై వేసి నిప్పు పెట్టేవాడు. ఆ తరువాత ఇంట్లో ఉన్న వారిని ఇల్లు కాలిపోతుందని బయటకు రావాలని తలుపులు తట్టి లేపి, విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు, డబ్బు బయటకు తెచ్చుకోమని సలహా ఇచ్చి వారికి సాయం చేస్తున్నట్టు నటించి వాటిని దొంగిలించాడు. ఈ ఘటనలకు పాల్పడుతున్నది ఎవరనే కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు శివకోడు లాకు సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ యువకుడిని అరెస్ట్ చేశారు. మైనర్ కావడంతో రాజమండ్రి మూడో ఏజేఎఫ్‌సీఎం కోర్టులో నిందితుడిని హాజరుపర్చినట్టు ఎస్సై లక్ష్మణరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment