తిరుపతిని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతా
తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్ : తిరుపతి నగరాన్ని జిల్లాలోనే ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి హామీ ఇచ్చారు. తిరుపతి పరిధిలోని ఇందిరానగర్‌లో శనివారం పార్టీ నాయకులు చంద్రారెడ్డి(న్యాయవాది), గౌరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం స్కావెంజర్స్ కాలనీలో పార్టీ నాయకులు హనుమంత్‌నాయక్, విష్ణు ఆధ్వర్యంలో ప్రజాబాట సాగింది. కరుణాకరరెడ్డి మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో గెలుపొందినప్పటి నుంచి నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజాసమస్యలను తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కారానికి కృషి చేస్తున్నానని గుర్తు చేశారు.
రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పటికీ అనేక సమస్యలను పరిష్కరించానని చెప్పారు. రాష్ట్ర సమైక్యత, తిరుపతి సమస్యలపై అసెంబ్లీలో ఏ ఎమ్మెల్యే మాట్లాడని విధంగా గొంతెత్తి చాటానని ఆయన పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే తిరుపతి పవిత్రతను ప్రపంచ దేశాలకు చాటిచెబుతానని హామీ ఇచ్చారు. తొమ్మిదేళ్ల చంద్రబాబునాయుడు పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడ్డారన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన పాపం ఆయనదేనన్నారు.
ఆరేళ్ల పాలనలో ఏ నాయకుడూ చేయలేనన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత మహానేత వైఎస్.రాజశేఖర రెడ్డికే దక్కుతుందన్నారు. తండ్రి ఆశయ సాధన కోసం నిరంతరం శ్రమిస్తున్న వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని అభ్యర్థించారు. జగనన్న అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాల మాఫీ, అమ్మఒడి, ఫీజురీయింబర్స్ మెంట్ తదితర పథకాలతో భరోసా కల్పిస్తారని చెప్పా రు. సీమాంధ్రులుగా ఉండి రాష్ట్ర విభజనకు సహకరించిన కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబులను ఓటు అనే ఆయుధంతో తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
అడుగడుగునా నీరాజనం
తిరుపతి పరిధిలోని ఇందిరానగర్‌లో ప్రజాబాట కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డికి అడుగడుగునా హారతులతో మహిళలు నీరాజనం పలికారు. మిమ్మల్నే తిరిగి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని మహిళలంతా కరుణాకరరెడ్డి చేతిలో చెయ్యి వేసి ముక్త కంఠంతో చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పులుగోరు ప్రభాకరరెడ్డి, ఎస్‌కే.బాబు, ఎంవీఎస్, మణి, తొండమనాటి వెంకటేష్‌రెడ్డి, ఎస్‌కే.ముస్తఫా, ఈశ్వర్, సునీల్, నారాయణరెడ్డి, నాథముని, గోవిందరెడ్డి, ఎస్‌డీ.శేఖర్, లతారెడ్డి, ముంజుల, శమంతకమణి తదితరులు పాల్గొన్నారు.