ఓట్లు.. కోట్లు
జిల్లాలో అన్ని రాజకీయ పార్టీల ఎన్నికల వ్యయం రూ.400 కోట్ల పైమాటే
అత్యధికంగా చంద్రగిరిలో రూ.60 కోట్ల వ్యయం
ఓటుకు రూ.1000 నుంచి రూ.2000 వరకు పంపిణీ
చిత్తూరు, తిరుపతిలో టీడీపీదే సింహభాగం
జిల్లాలో ఓట్లకోసం రాజకీయ నాయకులు కోట్ల రూపాయలతో ఆటలాడేసుకున్నారు. కరెన్సీ కట్టలు తెంచేసి ఓటర్లపై వెదజల్లేశారు. పార్టీ పరిస్థితి, అభ్యర్థిని బట్టి రేటు పెంచేశారు. ఒక్కో నియోజకవర్గంలో కనీసం పది కోట్ల రూపాయలకుపైగా ఖర్చయిందంటే పరిస్థితి ఏ స్థాయికి వెళ్లిందో తెలుసుకోవచ్చు. ఇందులో సింహభాగం టీడీపీ అభ్యర్థులే ఖర్చు చేసినట్టు విశ్లేషకులు లెక్కలు కడుతున్నారు.
సాక్షి, చిత్తూరు : ఓట్ల కోసం కోట్లు కుమ్మరించడం రాజకీయ నాయకులకు కొత్తకాదు. ఈసారి మరీ బరితెగించేశారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు కట్టలు తెంచేసి డబ్బు వెదజల్లేశారు. ఒక్కో ఓటుకు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు ముట్టజెప్పి ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని 14 అసెంబ్లీ, తిరుపతి, రాజంపేట, చిత్తూరు లోక్‌సభకు నిర్వహించిన ఎన్నికల్లో రూ.400 కోట్లకుపైగా ఖర్చయినట్టు సమాచారం. జిల్లాలోని ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లోనూ ఈసారి రూ.10 కోట్లు దాటినట్టు తెలుస్తోంది.
చిత్తూరు, తిరుపతిలో అన్ని రాజకీయ పార్టీలు రూ.50 కోట్ల దాకా ఖర్చు చేయగా ఒక్క చంద్రగిరిలో టీడీపీ మాత్రమే రూ.30 కోట్లు కుమ్మరించినట్టు తెలుస్తోంది. తిరుపతిలో 2004, 2012కన్నా ఈ సారి ఎక్కువ మొత్తంలో వివిధ రాజకీయపార్టీలు ఖర్చుచేసినట్టు సమాచారం. టీడీపీ అభ్యర్థి డబ్బులను మంచినీళ్లలా ఖర్చుచేసినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
గ్రామాలు, పట్టణాలు, వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి డబ్బులు, మద్యం పంచడం, చికెన్ ఇవ్వడం, ఇతర చిన్నచిన్న వస్తువులను కానుకలుగా ఇవ్వడం వంటివి చేసినట్టు తెలుస్తోంది. దీనికి తోడు చోటామోటా నాయకులు జారిపోకుండా చూసుకునేందుకు వారికి ఒక్కొక్కరికీ ఒక్కో రేటు ఫిక్స్ చేసి ఎన్నికల్లో ఉపయోగించుకున్నట్టు తెలుస్తోంది. ఈ తరహా ప్రయత్నాలకు ఈ సారి కోట్ల రూపాయలు ఖర్చుచేసినట్టు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో డబ్బుకోసం ఓటర్లు అభ్యర్థుల వెంట పడడంతో వారు మరింత బరితెగించేసినట్టు తెలుస్తోంది.
నియోజకవర్గాల వారీగా ఖర్చు వివరాలు చూస్తే
- తిరుపతి నియోజకవర్గంలో టీడీపీతో పాటు అన్ని రాజకీయ పార్టీల ఎన్నికల వ్యయం రూ.50 కోట్లకు పైగా ఉంటుందని అనధికారిక అంచనా. ఇందులో సింహభాగం తెలుగుదేశందే. ఈ పార్టీ రూ.40 కోట్లకుపై ఖర్చుచేసినట్లు విశ్లేషకుల అంచనా.
- చిత్తూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి డబ్బును కుమ్మరించేశారని సమాచారం. నియోజకవర్గం మొత్తంగా అన్ని రాజకీయ పార్టీలు రూ.50 కోట్లకు పైగా ఖర్చుచేసినట్టు తెలుస్తోంది.
- శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్నికల వ్యయం రూ.25 కోట్లు అయితే అందులో ఒక్క టీడీపీనే రూ.10 కోట్లకుపైగా ఖర్చుచేసినట్టు సమాచారం.
- చంద్రగిరి నియోజకవర్గంలో జిల్లాలోనే అత్యధికంగా రూ.60 కోట్ల వరకు ఖర్చుచేసినట్టు భోగొట్టా. టీడీపీ అభ్యర్థే రూ.30 కోట్ల వరకు వెదజల్లినట్టు అంచనా.
- పలమనేరు నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీల ఎన్నికల వ్యయం రూ.25 కోట్లు దాటింది.
- సత్యవేడు నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీల ఎన్నికల ఖర్చు రూ.10 కోట్ల పైమాటే. ఇందులో టీడీపీనే రూ.6 కోట్ల వరకు ఖర్చుచేసినట్లు సమాచారం.
- నగరి నియోజకవర్గంలో అన్ని రాజకీయపార్టీలు రూ.10 కోట్లకు పైగా ఖర్చుచేసినట్టు తెలిసింది.
- పూతలపట్టు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో ఎన్నికల వ్యయం రూ.12 కోట్లు దాటినట్టు తెలుస్తోంది. పోటీ గట్టిగా ఉన్న మండలాల్లో ఒక్కో ఓటుకు రూ.500 నుంచి రూ.1000 వరకు పంచాల్సి వచ్చింది.
- పుంగనూరు నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీల ఎన్నికల వ్యయాం రూ.30 కోట్లు దాటిందనేది విశ్లేషకుల అంచనా.
- కుప్పం నియోజకవర్గంలోనూ రూ.20 కోట్లకు పైగా అన్ని రాజకీయపార్టీలు వ్యయం చేయాల్సి వచ్చింది.
- మాజీ సీ.ఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి సొంత నియోజకవర్గంలో రూ.30 కోట్ల వరకు ఖర్చుచేసినట్టు తెలుస్తోంది.
- జీ.డీనెల్లూరు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో రూ.8 కోట్ల వరకు ఖర్చుచేసినట్టు సమాచారం.
- తంబళ్లపల్లె నియోజకవర్గంలో రూ.18 కోట్లు దాటినట్లు తెలుస్తోంది. ఇందులో ఒక్క టీడీపీ నుంచే రూ.12 కోట్ల వరకు ఖర్చుపెట్టినట్టు ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు.