ఇది కచ్చితంగా రాజకీయ యుద్ధమే!
న్యూఢిల్లీ: ‘ఇది కుట్ర కాదు, ఓ యుద్ధం’ అని గుజరాత్ నుంచి రాజ్యసభకు జరుగుతున్న ఎన్నికల్లో సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్‌ను ఓడించేందుకు పాలకపక్ష భారతీయ జనతా పార్టీ సర్వశక్తులు ఒడ్డడం పట్ల సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జైరామ్ రమేశ్ చేసిన వ్యాఖ్య ఇది. అహ్మద్ పటేల్ విషయంలో గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే తుదముట్టించేందుకు జరుగుతున్న అంతిమ యుద్ధంలాగే కనిపిస్తోంది.
బయటి ప్రజలకు పెద్దగా తెలియకపోయినా అహ్మద్ పటేల్, తెరవెనక నుంచి రాజకీయాలను నెరపడంలో దిట్టనే విషయం కాంగ్రెస్ పార్టీకే కాకుండా అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు. అందుకే యూపీఏ పాలనలో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, ఆ తర్వాత అహ్మద్ పటేల్‌ను పవర్ సెంటర్‌గా పేర్నొనే వారు. అలాంటి వ్యక్తిని మట్టి కరిపించేందుకు బీజేపీ రాజకీయ చాణక్యుడు అమిత్ షా పన్నుతున్న వ్యూహం ఆషామాషిగా లేదు. వ్యూహరచనలో తమకుతామే సాటైన ఇద్దరు ఉద్దండ పిండాల మధ్య కొనసాగుతున్న యుద్ధమిదని, ఇది ఇరువురి పరవు ప్రతిష్టలకు సంబంధించిన అంశమని సీనియర్ కాంగ్రెస్ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు.
ఆగస్టు 8వ తేదీన గుజరాత్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు జరుగుతున్న ఎన్నికల్లో అసెంబ్లీ బలాబలాల రీత్యా బీజేపీ నుంచి ఇద్దరు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరు విజయం సాధించే అవకాశం ఉంది. అందుకని బీజేపీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను, కేంద్ర మంత్రి స్మతి ఇరానీని నిలబెట్టింది. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్‌ను బరిలోకి దించింది. కాంగ్రెస్ అసమ్మతి నాయకుడు శంకర్‌సింహ్ వఘేలా తన ఆరుగురు విధేయులతో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడంతో హఠాత్తుగా రాజకీయ నాటకం పురుడు పోసుకుంది. పర్యవసానంగా 182 స్థానాలుగల గుజరాత్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ బలం 54కు పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన వారిలో ఒకరైన బల్వంత్‌సింహ్ రాజ్‌పుత్‌ను బీజీపీ బరిలోకి దింపింది.
సులువుగా గెలిచే అవకాశం ఉన్న అహ్మద్ పటేల్‌ను దెబ్బతీయడం కోసం రాజ్‌పుత్‌ను బీజేపీ రంగంలోకి దించడంతో రసవత్తర రాజకీయాలకు తెరలేచింది. దీంతో తన ఎమ్యెల్యేలను జారీపోకుండా చూసుకునేందుకు ముందు జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీ 44 మంది ఎమ్మెల్యేలను కర్ణాటకలోని ఓ రిసార్ట్‌కు తరలించింది. ఆ రిసార్ట్ యజమాని అయిన కర్ణాటక కాంగ్రెస్ మంత్రి శివకుమార్ ఆస్తులపైనా ఆగస్టు రెండవ తేదీన ఆదాయం పన్ను శాఖ హఠాత్తుగా దాడులు జరిపింది. భారీ ఎత్తున నగదును, ఆస్తులను స్వాధీనం చేసుకొంది. రాజకీయ కుట్రతో జరిపిన దాడులు అంటూ కాంగ్రెస్ ఎన్ని విమర్శలు చేసినా పెద్దగా పట్టించుకోకుండా బీజేపీ తన వ్యూహరచనను అములు చేయడంలో ముందుకే వెళుతోంది.
సరిగ్గా ఈ సమయంలోనే కాంగ్రెస్ పార్టీకి సుప్రీం కోర్టులో మరో ఎదురు దెబ్బ తగిలింది. రాజ్యసభలో ఎవరికి ఓటు వేయను, అనే ‘నన్ ఆఫ్ ఎబవ్ (నోటా)’ను అమలు చేయరాదంటూ పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. రాజ్యసభకు జరిగే పరోక్ష ఎన్నికలకు కూడా నోటాను అమలు చేయాలంటూ తాము 2014లో ఉత్తర్వులు జారీ చేయగా, వాటిని సవాల్ చేస్తూ ఇంత ఆలస్యంగా వస్తారా ? అన్న కారణంగా కాంగ్రెస్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. పార్టీ విప్‌ను ధిక్కరించి రాజ్యసభకు ఓటు వేసిన పక్షంలో ఎమ్మెల్యే పార్టీ సభ్యత్వాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పార్టీ విప్‌ను ధిక్కరించి నోటాకు ఓటేయడం వల్ల సభ్యత్వం కోల్పోకపోవచ్చు. తద్వారా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. చివరి నిమిషంలో బీజేపీ కూడా నోటా వద్దంటూ సుప్రీం కోర్టుకు పిటిషన్ పెట్టుకుంది. మరి ఆ పార్టీ ఉద్దేశం ఏమిటో!
ఇన్ని పరిణామాల మధ్య గుజరాత్ నుంచి రాజ్యసభకు జరుగుతున్న ఎన్నికలపై ప్రజలందరి దష్టి కేంద్రీకతమై ఉంది. ముఖ్యంగా అహ్మద్ పటేల్ గెలుస్తారా, లేదా? అన్నదే ఆసక్తికర మైన అంశం. పటేల్‌ను ఓడించడం ద్వారా సోనియా గాంధీని కోలుకోని దెబ్బతీయాలన్నదే బీజేపీ ప్రధాన ప్రణాళికగా స్పష్టమవుతోంది.