బంధం తెగుతోంది!
కనిపించని దైవానికి నిజరూపం కనీపెంచిన తల్లి అని నమ్ముతున్నాం. నమ్మకానికి ప్రతిరూపంనాన్నేనని కథలు కథలుగా చెప్పుకుంటున్నాం. అయితే.. క్షణికావేశం పేగు‘బంధం’తెంచేస్తోంది. నమ్మకాన్ని వమ్ము చేస్తోంది. ఫలితంగా మాతృత్వం మరుగునపడుతోంది.పితృత్వం లోకాన్ని విస్మయపరుస్తోంది. మానవత్వాన్ని మంటగలుపుతోంది.
- క్షణికావేశం...చిన్నారుల పాలిట శాపం
- విచక్షణారహితంగా వ్యవహరిస్తున్న తల్లిదండ్రులు
- గాల్లో కలుస్తున్న పసిప్రాణాలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: అప్పులు ఎక్కువయ్యాయి. వాటి నుంచి బయటపడే మార్గం కనిపించలేదు. అతనికి పిరికితనం ఆవహించింది. క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అల్లారుముద్దుగా పెంచుకున్న ఇద్దరు కుమార్తెలకు శీతల పానీయంలో పురుగుల మందు కలిపి ఇచ్చి, తాను తాగాడు. ఈ సంఘటన ఆదివారం పుత్తూరులో చోటు చేసుకున్న విషయం విధితమే. ఇందులో తండ్రి రమేష్‌తోపాటు, కుమార్తెలు శ్రుతి(8), షణ్ముఖ ప్రియ(6)చనిపోయారు. తన పిల్లపై ఉన్న మమకారమో ఏమోగానీ, తాను చనిపోతే తన పిల్లలకు ఎవరు దిక్కని ఆలోచించడం వరకు సబబే.
అయితే ఆ చిన్నారులను పొట్టబెట్టుకునే హక్కు ఎవరిచ్చారనేది అందరినీ వేధించే ప్రశ్న. కన్నతల్లికి ఆ బిడ్డలను దూరం చేసి, క్షోభ మిగల్చడం తగునా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆత్మహత్య చేసుకునే ముందు ఆ తండ్రి ఒక్క క్షణం ఇవన్నీ ఆలోచించి ఉంటే ఇంత దారుణానికి ఒడికట్టే వాడు కాదని అక్కడ గ్రామస్తులు చర్చించుకున్నారు. ఇలాంటి దారుణాలకు ఒడికట్టకుండా ఉండాలని మేధావులు సైతం ధైర్యం నూరి పోస్తున్నారు.
సోమవారం తిరుపతి రూరల్ మండలం విద్యానగర్‌లో ఎనిమిది నెలల బిడ్డ ఏడుపు ఆపలేదని ఓ తల్లి ఒక్క క్షణం విచక్షణ కోల్పోయింది. చిన్నారని చెంప చెళ్లుమనిపించింది. దీంతో చెవి, నోటిలో నుంచి రక్తం కారి ఆ చిన్నారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆ తల్లి బాధతో కన్నీరు మున్నీరైంది. ఫలితం దిద్దుకోలేని తప్పు జరిగిపోయింది.