నీటి మూటలేనా..?
మాటలు కోటలు దాటాయి. కానీ పనులు పేటలు చేరలేదు. అధికార పార్టీ నేతల హామీలు మరోసారి నీటి మీద రాతలేనని నిరూపితమవుతోంది. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీలు చేయకపోవడంతో ఇప్పటికే ప్రభుత్వంపై పలు వర్గాల వారు గుర్రుగా ఉన్నారు. దీనికి తోడు అన్నగారి పేరు మీద ‘ఎన్‌టీఆర్ సుజల స్రవంతి’ పథకాన్ని ప్రకటించిన నాయకులు ఆ పథకాన్ని అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోలేకపోయారు. దీంతో జిల్లాలో ముందుగా అనుకున్నంత మేర నీరు ఇవ్వలేకపోతున్నారు. అట్టహాసంగా ప్రకటిస్తున్న పథకాలకు ఆదిలోనే హంసపాదు పడుతుండడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
విజయనగరం క్రైం: అక్టోబర్ రెండు నుంచి ప్రారంభం కావాల్సి ఉన్న సుజల స్రవంతి పథకానికి ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం అన్ని గ్రామాలకు అందడం కష్టంగానే ఉందని ఆ శాఖ అధికారుల నుంచే వినిపిస్తోంది. జిల్లాలో ఎన్టీర్ సుజల స్రవంతి పథకం ద్వారా ప్రజలకు మంచినీరు అందించాలని ప్రభుత్వం భావించింది. దీని కోసం అక్టోబర్ రెండున ముహూర్తం కూడా పెట్టుకున్నారు. అయితే పథకం అమలులో ప్రభుత్వం చిన్న మెలిక పెట్టింది. ఇప్పుడు ఆ మెలికే పీటముడిగా మారి పథకం అమలును ప్రశ్నార్థకం చేసింది.
సుజల స్రవంతి పథకం అమలుకు స్పాన్సర్లను చూడాలని కలెక్టర్, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులకు బాధ్యతలు అప్పగించారు పారిశ్రామిక వేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, ట్రస్ట్‌లకు చెందిన ప్రతినిధులు ముందుకు రావాలని కోరారు. స్పాన్సర్లు ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తే ప్రభుత్వం షెడ్‌ను అప్పగిస్తుంది. మెయింటెన్స్ ఖర్చు స్పాన్సర్లు భరించాలి. అయితే 20 లీటర్ల నీటికి రూ.2 చొప్పున వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. జిల్లాలో 427 గ్రామాలకు ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ద్వారా మంచినీటిని అందించాలని నిర్ణయించారు. కానీ ప్రస్తుతానికి 82 గ్రామాలకు నీటిని అందించేందుకు స్పాన్సర్లు ముందుకు వచ్చారు. ఇందులో ఇండస్ట్రీల నుంచి 9 మంది, స్వచ్ఛంద సంస్థల నుంచి ముగ్గురు, ట్రస్ట్‌ల నుంచి ముగ్గురు ముందుకు వచ్చారు. ప్రభుత్వం నిర్ణయించిన 427 గ్రామాలకైతే అన్నింటికీ స్పాన్సర్లు ముందుకు రాకపోవడం విశేషం. ప్రస్తుతం వచ్చిన స్పాన్సర్లు సైతం అతికష్టం మీద తెరమీదకు వచ్చినట్లు తెలిసింది.
భారం భరించాల్సిందే...
ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం నిర్వహణకు ఖర్చు ఎక్కువ రాబడి తక్కువగా ఉండడంతో స్పాన్సర్లు ముందుకు రావడం లేదు. ప్లాంట్ ఏర్పాటుకు సుమారు రూ.3లక్షల నుంచి 5 లక్షల వరకు ఖర్చవుతుంది. గ్రామాల్లో మంచినీటిని కొని తాగేందుకు ఇష్టపడరు. అందువల్ల ప్లాంట్ నిర్వహణ భారం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ప్లాంట్ ఏర్పాటు నిర్వహణ భారం ప్రభుత్వం తీసుకుంటే మంచిదని విశ్లేషకులు భావిస్తున్నారు. స్పాన్సర్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన 82 గ్రామాల్లో షెడ్‌లు నిర్మించాల్సి ఉంది. ఆ పనులు ఇంకా జరగడం లేదు. పథకం ప్రారంభిస్తామని చెప్పిన తేదీ దగ్గరపడుతోంది. అప్పటి లోగా షెడ్‌ల నిర్మాణాలు జరగడం కష్టమే.