ఎండ తీవ్రతకు ముఖానికి చున్నీలు కట్టుకుని వెళుతున్న యువతులు
జిల్లాలో నాలుగు రోజులుగా వేస్తున్న తీవ్రమైన ఎండలకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రత ప్రారంభం కావడంతో బయటకు వచ్చేందుకు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. రాత్రి 9 గంటల వరకూ దాని ప్రభావం కొనసాగుతుంది. ఈ దశలో ఏమి చర్యలు తీసుకోవాలి, వడదెబ్బకు గురైనప్పుడు ఏమి చేయాలనే దానిపై సాక్షి ప్రత్యేక కథనం...
లబ్బీపేట(విజయవాడతూర్పు): జిల్లాలో పగటి ఉష్ణోగ్రత 42 డిగ్రీలకు చేరుకుంది. ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ప్రభుత్వాస్పత్రితోపాటు, ప్రవేటు ఆస్పత్రిలకు ఎంత తీవ్రతతో తలనొప్పి, ఎండ ప్రభావానికి గురైన వారికి రాత్రి నిద్రపట్టక పోవడం వంటి సమస్యలతో వస్తున్నట్లు చెపుతున్నారు. ఇంట్లో ఉన్న వృద్ధులు, చిన్నారులు సైతం హీట్‌స్ట్రోక్‌కు గురయ్యే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో సరైన జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణాపాయం కలిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మరో ఐదు రోజుల్లో వేసవి సెలవులు కావడంతో పిల్లలు ఎక్కువగా అవుట్‌డోర్ గేమ్స్ ఆడుతుంటారని, ఉదయం 9 నుంచి సాయంత్రం 5లోపు ఎట్టిపరిస్థితుల్లో బయట ఆటలకు అనుమతించరాదని నిపుణులు సూచిస్తున్నారు.
వీరిపై ఎక్కువగా ప్రభావం
ఎండల ప్రభావం మధుమేహం, రక్తపోటు వ్యాధులు ఉన్న వారు, వృద్ధులు, చిన్నారులు, స్మోకర్స్, ఆల్కాహాల్ సేవించే వారిపై ఎక్కువగా చూపుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వారు ఎండలోకి కొద్దిసేపు వెళ్లినా సన్‌స్ట్రోక్‌కు గురవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తలుపులన్నీ మూసి ఇంట్లో ఉన్న వృద్ధులు, చిన్నారులు సైతం హీట్‌స్ట్రోక్ ప్రభావంతో శరీరం డీ హైడ్రేషన్‌కు గురవుతుంటారని పేర్కొంటున్నారు. ఇలాంటి వారు వడగాలుల ప్రభావం పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
వడగాలులు తగలకుండా ఏమిచేయాలి
♦ బయటకు వెళ్లే టప్పుడు తలకు టోపీలు మంచి రక్షణ కవచంలా ఉపయోగపడుతుంటాయి.
♦ కళ్లజోడుతోపాటు, చెవులు, ముక్కుల్లోకి వేడిగాలులు ప్రవేశించకుండా కర్చీఫ్ కట్టుకుంటే మంచిది.
♦ ఎక్కువ సేపు ఎండలో ఆటలు ఆడటం వలన ఆల్ట్రావైలేట్ కిరణాలు నేరుగా శరీరంపై పడినప్పుడు సన్ బరŠన్స్, స్కిన్ ఇన్‌ఫెక్షన్స్(రాష్) రాకుండా సన్‌స్క్రీన్ లోషన్స్ రాసుకోవాలి.
♦ ప్రస్తుతం నగరంలో ఎక్కువ మంది చిన్నారులు స్కిన్ ఇన్‌ఫెక్షన్స్‌తో బాధపడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
♦ ఎండలో ఆటలాడే సమయంలో తరచూ ముఖం నీటితో కడుక్కోవడం ద్వారా కళ్లకు సరిపడా తేమ లభిస్తుంది.
ఆహారంలో పాటించాల్సిన నియమాలు
♦ వడగాలులకు శరీరంలోని నీరు ఆవిరై డీ హైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉన్నందున తరచూ ద్రవపదార్థాలు అధికంగా తీసుకోవాలి.
♦ కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్‌ల కంటే పళ్ల రసాలు, కొబ్బరినీళ్లు, మజ్జిగ తాగితే మంచిది.
♦ పుచ్చకాయ, చీని, ద్రాక్షలో ఎక్కువ నీటి శాతం వుంటుంది. కాబట్టి వాటిని తీసుకుంటే మంచిది.
♦ రోజుకు 4 నుంచి 5 లీటర్లు నీరు తాగాలి. కాచి చల్లార్చిన నీరు తాగితే మంచిది. క్లూగోజ్, కొబ్బరినీళ్లు తీసుకుంటే తాపాన్ని తగ్గిస్తాయి.
సన్‌స్ట్రోక్ లక్షణాలు
తలనొప్పి, అధిక జ్వరం (107డిగ్రీల ఫారిన్‌హీట్ టెంపరేచర్), శరీరం డీహైడ్రేషన్‌కు గురికావడంతో స్పృహ కోల్పోవడం, వాంతులు, విరేచనాలు, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వడదెబ్బకు గురై స్పృహ కోల్పోయిన సమయంలో శరీరంపై ఉన్న దుస్తులు తొలగించి, నీడప్రదేశంలోకి తీసుకువెళ్లాలి. శరీరాన్ని తడి వస్త్రంతో తుడిచి వీలైనంత త్వరగా ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వుంది. అక్కడ ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించడంతోపాటు, అవసరాన్ని బట్టి చికిత్స అందిస్తారు. శరీరం డీహైడ్రేషన్‌కు గురైన సమయంలో అశ్రద్ధ చేస్తే, గుండె, కిడ్నీలు, మెదడుపై తీవ్ర ప్రభావం చూపి, మృతి చెందే అవకాశాలు వుంటాయని నిపుణులు సూచిస్తున్నారు.
వేసవిలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి
రక్తపోటు, మధుమేహం ఉన్న వారు త్వరగా ఎండల ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్నందున వీలైనంత వరకూ ఎండకు ఎక్స్‌పోజ్ కాకుండా చూసుకోవాలి. అంతేకాకుండా రెగ్యులర్‌గా బీపీ, షుగర్ అదుపులో ఉన్నాయో లేదో పరీక్షలు చేయించుకోవడం మంచింది. వృద్ధులు, చిన్నారులు ఇంట్లో ఉన్నా హీట్ స్ట్రోక్‌కు గురయ్యే ప్రమాదం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. ఆయిల్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు, నాన్‌వెజ్ తీసుకోక పోవడం మంచింది. ఆకుకూరలు, పప్పు వంటివి తీసుకోవాలి. ఇంటి ఆవరణలో చెట్లు పెంచుకోవడం ద్వారా ఎండల తీవ్రతను తగించవచ్చు. వడదెబ్బకు గురైనా, లక్షణాలు కనిపించినా సత్వరమే ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందడం మంచిది.–డాక్టర్ ఎం.శ్రీకాంత్, డయాబెటాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment