న్యూస్‌లైన్ నెట్‌వర్క్: నల్లగొండ, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో సోమవారం ఎండతీవ్రతకు తాళలేక నలుగురు మృతి చెందారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం నోముల శివారు ఇస్లాంపురలో ఉపాధి హామీ కూలీ నజీర్ (32) వడదెబ్బకు గురై పనులు చేసే చోటే సొమ్మసిల్లి పడిపోయి మరణించాడు. కరీంనగర్ జిల్లా కోహెడ మండల కేంద్రానికి చెందిన కూలీ గజ్జెల మల్లయ్య(52) మధ్యాహ్నం ఎండవేడిమి తట్టుకోలేక వాంతులు, విరోచనాలు చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగానే మృతిచెందాడు. ఓదెల మండలం జీలకుంట పరిధిలోని గొల్లపల్లికి చెందిన ఉడుత కొమురయ్య(70) వడగాలులు తట్టుకోలేక మృతి చెందాడు. అలాగే, ఖమ్మం జిల్లా మధిర మండలం నాగవరప్పాడుకు చెందిన తాళ్లూరి వెంకటేశ్వర్లు(70) రెండు రోజుల క్రితం వడదెబ్బకు గురికాగా, సోమవారం మృతి చెందాడు.