
సాక్షి, అమరావతి: రైతులకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరాను రేపటి నుంచి అమలు చేస్తామని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడంపై వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌ను కలిసి అభినందించారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు 9 గంటల విద్యుత్ ఇస్తానని చెప్పి మోసం చేశారని, కానీ సీఎం వైఎస్ జగన్ తాను ఇచ్చిన హామీని అమలు చేసి నిరూపించారన్నారు.
రైతులకు గురువారం నుంచే పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 60 శాతం ఫీడర్ల ద్వారా రేపటి నుంచే పగటిపూట నిరంతరాయంగా 9 గంటల విద్యుత్ సరఫరా చేయాలని చెప్పారు. మిగిలిన 40 శాతం ఫీడర్ల మరమ్మతులకు రూ. 1700 కోట్ల రూపాయలు విడుదల చేశారు. వచ్చే ఏడాది జులై నుంచి మిగిలిన 40 శాతం ఫీడర్ల నుంచి కూడా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు.