
పోడూరు : పెళ్లంటే పందిళ్లు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు.. మూడే ముళ్లు.. ఏడే అడుగులు.. మొత్తం కలిపి నూరేళ్లు.. అంటూ వివాహం గురించి, పెళ్లి సందడి గురించి ఒక్క పాటలో కవులు తెలిపారు.మన భారతదేశంలో వివాహ వ్యవస్థకు ప్రత్యేక విశిష్టత ఉందని విదేశీయులు సైతం నమ్ముతారు. వివాహం తర్వాత ప్రతి ఒక్కరికి కొత్త జీవితం ప్రారంభమవుతుంది. కొత్త బంధాలు, బంధుత్వాలు ఏర్పడుతాయి. తాళి అనే బంధం ఏర్పడినప్పటి నుంచి కాటికి చేరే వరకు భార్యాభర్తలు ఒకరికొకరు కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ తోడూ నీడగా ఉంటారు. అలాంటి పటిష్టమైన మన వివాహ వ్యవస్థను కట్న కానుకలు, లాంఛనాలనే చీడ పురుగు పట్టి పీడిస్తుంది. ఇటీవల పేద, ధనిక అనే తేడా లేకుండా ఆడంబ రాలకు పోయి తలకు మించిన ఖర్చులు పెడుతూ పెళ్లిళ్లు వైభవంగా జరిపిస్తున్నారు. అయితే కట్నం కోసం అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను వేధించే అత్తింటి వారు, అలాగే అత్తింటివారిపై తప్పుగా వరకట్న కేసులు పెట్టి వేధించే కోడళ్లను నిత్యం సమాజంలో చూస్తున్నాం. ఈనేపథ్యంలో వరకట్న వేధింపులను అరికట్టేందుకు ప్రభుత్వం 498 చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది.
ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకుని తప్పుడు వరకట్న కేసులు కూడా నమోదవుతున్నాయి. భార్యాభర్తల గొడవల్లో కోర్టులకెక్కినపుడు పెళ్లి సమయంలో అనేక లాంఛనాలు సమర్పించామని, ఘనంగా ఖర్చు చేసి పెళ్లి జరిపించామని ఇరువైపుల నుంచి కోర్టులో పిటీషన్లు దాఖలవుతున్నాయి. కట్నం కోసం కట్టుకున్నదాన్ని తన్ని పుట్టింటికి తరిమివేసేవారు కొందరైతే, అత్తింటివారిపై తప్పుడు కేసులు పెట్టి వేధించే అతివలు మరికొందరున్నారు. ఇలా ఇరువైపుల నుంచి వచ్చే కేసుల దృష్ట్యా ఇలాంటి తప్పుడు కేసులు అరికట్టేందుకు ఇటీవల సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఒక సూచన చేసింది. దాని ప్రకారం పెళ్లి సమయంలో అయ్యే ఖర్చుల వివరాలను ప్రభుత్వానికి సంబంధీకులు సమర్పించాలని కోర్టు సూచించింది. ఈ నిర్ణయాన్ని అనేక మంది స్వాగతిస్తున్నారు. గతంలోనూ వివాహాల గురించి చట్టాలు వచ్చాయి. వివాహాలను తప్పనిసరిగా నమోదు చేయాలనే చట్టం ఉన్నా అమలు చేసే అధికార యంత్రాంగం, ఆచరించే ప్రజలు లేక అవి నిష్ఫలమయ్యాయి. అందుకే చట్టాలు వచ్చినపుడు ప్రజలు దాన్ని అర్ధం చేసుకుని నడుచుకుంటే సత్ఫలితాలుంటాయి. అలాగే చట్టాలను ప్రభుత్వం సక్రమంగా అమలు చేసినపుడే ప్రయోజనం ఉంటుంది. పెళ్లి ఖర్చులు ప్రభుత్వానికి తెలపాలనే సుప్రీంకోర్టు సూచనను పలువురు మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
వరకట్న వివాదాలుండవు
సుప్రీంకోర్టు చెప్పినట్లుగా చట్టం చేస్తే ముఖ్యంగా మన దేశంలో వరకట్న వివాదాల కు చెక్ పడుతుంది. వరకట్న వివాదాల్లో చాలా వరకు తప్పుడు కేసులు ఉంటున్నాయి. పెళ్లిళ్ల పేరుతో చేసే ఆడంబరాలు తగ్గుతాయి. ఇలాంటి ఆడంబరాలు తగ్గించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుంది.-కొప్పిశెట్టి ఏసుబాబు, గుమ్మలూరు
అప్పుల బాధ తప్పుతుంది
పేద, సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు ఒక ఆడ బిడ్డకు పెళ్లి చేయాలంటే లక్షల్లో అప్పు చేయాల్సిన పరిస్థితి మనదేశంలో నెలకొంది. ఆర్థిక సామర్థ్యం లేకపోయినా కట్న కానుకలు, ఆడంబరాల కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అమలు చేయడం వల్ల ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆ అప్పుల బాధ చాలా వరకు తగ్గుతుంది.తాళాబత్తుల వెంకటేశ్వరరావు, జిన్నూరు
కచ్చితంగా అమలు చేయాలి
పెళ్లి ఖర్చులు ప్రభుత్వానికి చెప్పాలన్న నిర్ణయాన్ని కచ్చితంగా అమలు చేయాలి. వరకట్న నిషేధం ఎప్పట్నుంచో అమలులో ఉన్నా సరిగా అమలు కావడం లేదు. వర కట్నాల వల్ల కొంత మంది సంసారాలు నాశనమవుతున్నాయి. అత్తింటి పోరు తట్టుకోలేక ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.అందే నాగేశ్వరరావు, రావిపాడు
Comments
Please login to add a commentAdd a comment