
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ 176పై సుప్రీంకోర్టు స్టే విధించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల్లో జీఓ 176 జారీ చేసిన సంగతి తెలిసిందే. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న సుప్రీంకోర్టు గత తీర్పు నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం 59.85 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై విచారణ జరపాలని ఏపీ హైకోర్టుకు సూచించింది. ఈ రిజర్వేషన్ల వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాలను నాలుగు వారాల్లోగా తేల్చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే, న్యాయమూర్తులు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాలు చేస్తూ బీసీ రామాంజనేయులు, బిర్రు ప్రతాప్‌రెడ్డి, మరికొందరు కొద్దిరోజుల క్రితం హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం, ప్రభుత్వం నిర్ణయించిన 59.85 శాతం రిజర్వేషన్లపై జోక్యానికి నిరాకరించిన సంగతి తెలిసిందే.
ఈ నెల 17న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనిని సవాలు చేస్తూ బీసీ రామాంజనేయులు, బిర్రు ప్రతాప్‌రెడ్డిలు వేర్వేరుగా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేశారు. మంత్రివర్గంలో, నామినేటెడ్ పదవుల్లో, ఇతర ప్రభుత్వ పదవుల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు బలహీనవర్గాలకు పెద్దపీట వేసిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో స్థానిక సంస్థల్లోను బలహీనవర్గాలకు తగిన న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుంది.
పంచాయతీరాజ్ చట్టం ఆధారంగానే రిజర్వేషన్లు కల్పించాం
సుప్రీంలో విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు అంజనా ప్రకాశ్, ప్రేరణా సింగ్ తదితరులు వాదనలు వినిపిస్తూ, కె.కృష్ణమూర్తి వర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రిజర్వేషన్లు 50 శాతం దాటరాదని సుప్రీంకోర్టు 2010లో తీర్పునిచ్చిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే 50 శాతం దాటొచ్చని తీర్పులో చెప్పారని, ఏపీలో అలాంటి పరిస్థితులేవీ లేవని వివరించారు. సుప్రీం గత తీర్పుకు విరుద్ధంగా రిజర్వేషన్లు కల్పించడాన్ని ఎలా సమర్ధించుకుంటారని ఏపీ ప్రభుత్వ న్యాయవాది ఆర్.వెంకటరమణిని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ సందర్భంగా వెంకటరమణి స్పందిస్తూ.. 1994 పంచాయతీరాజ్ చట్టంలో జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనుందని.. ఆ మేరకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని చెప్పారు.
హైకోర్టు తేల్చడమే సబబు: సుప్రీం
ఆ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, రిజర్వేషన్లు 50 శాతం దాటరాదన్న తమ తీర్పును వచ్చే పదేళ్లలో కూడా అమలు చేసే పరిస్థితులు కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. వచ్చే ఎన్నికల్లో కాకున్నా, ఆ వచ్చే ఎన్నికల నాటికైనా చట్టాన్ని సవరించి తమ తీర్పును అమలు చేస్తారని ఆశిస్తున్నామని పేర్కొంది. ఏది ఏమైనా తమ తీర్పును మాత్రం అమలు చేసి తీరాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటొచ్చని కృష్ణమూర్తి కేసులో సుప్రీం చెప్పిందని వెంకటరమణి చెప్పగా, ఆ ప్రత్యేక పరిస్థితులు కేవలం షెడ్యూల్ ప్రాంతాలకే పరిమితమని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు.
ఇంతవరకు ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయలేదన్న విషయాన్ని ధర్మాసనం దృష్టికి వెంకటరమణి తీసుకొస్తూ.. ఎన్నికలకు ముందే రిజర్వేషన్ల వ్యవహారాన్ని హైకోర్టు తేలుస్తామంటే తమకు అభ్యంతరం లేదని ధర్మాసనానికి వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, ఈ వ్యవహారాన్ని కేసు పూర్వపరాల ఆధారంగా నిబంధనలకు లోబడి హైకోర్టే తేల్చడం సబబని అభిప్రాయపడింది. సంక్రాంతి సెలవుల అనంతరం ఈ నెల 20న హైకోర్టు కార్యకలాపాలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ రోజున తామిచ్చిన ఉత్తర్వులను సీజే నేతత్వంలోని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లాలని పిటిషనర్లను సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఈ వ్యాజ్యాలు తేలేంత వరకు జీవో 176పై స్టే ఉంటుందని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment