
నంబర్ ప్లేట్ లేని వాహనాలపై నిఘా
కర్నూలు(అర్బన్): నంబర్ ప్లేట్ లేని వాహనాలపై నిఘా ఉంచాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ఆర్టీఏ అధికారులను ఆదేశించారు.
కర్నూలు(అర్బన్):
నంబర్ ప్లేట్ లేని వాహనాలపై నిఘా ఉంచాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ఆర్టీఏ అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో గురువారం ఆర్‌అండ్‌బీ, రవాణా శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాలను నివారణకు జిల్లా వ్యాప్తంగా రోడ్లకిరువైపులా షైన్ బోర్డ్స్, ఫ్లెక్సీ బ్యానర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యా సంస్థలు, ప్రధాన కూడళ్లలో ర్యాలీలు, సదస్సులు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. మీ-సేవ, ఆన్‌లైన్ ద్వారా డ్రైవింగ్ లెసైన్స్ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పండుగలు, జాతరల సందర్భంగా ప్రైవేటు వాహనదారులు అధిక మొత్తంలో చార్జీలను వసూలు చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చిందని, వెంటనే తనిఖీలు నిర్వహించి అలాంటి వాహనాల పర్మిట్లను రద్దు చేయాలని డీటీసీ శివరాంప్రసాద్‌ను ఆదేశించారు. పంచలింగాల, శ్రీశైలం చెక్‌పోస్టులపై పర్యాటకుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయని, సంబంధిత అధికారులు బాధ్యతగా పని చేయకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. డీటీసీ శివరాంప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సేవలందిస్తున్నామని, రెవెన్యూ పరంగా రూ.136 కోట్ల లక్ష్యానికి గాను ఇప్పటి వరకు రూ.78.11 కోట్లు వసూలు చేశామని వివరించారు. సమావేశంలో ఎంవీఐలు చంద్రబాబు, రమణ, శ్రీనివాసులు, శేషాద్రి, రాజబాబు, రాజేశ్వరరావు, నారాయణ నాయక్, విజయకుమారి పాల్గొన్నారు.
45 రోజుల్లో పెండింగ్ రోడ్ల పనులు పూర్తి..
పెండింగ్‌లో ఉన్న రోడ్ల పనులకు ప్రాధాన్యతనిచ్చి 45 రోజుల్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ఆదేశించారు. గురువారం స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో రోడ్ల అభివృద్ధి, కార్పొరేషన్ ఛీఫ్ ఇంజినీర్ జగన్నాథరావుతో కలిసి ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ 25 శాతం రోడ్ల పనులు వేగవంతం చేసేందుకు రెండు, మూడు రోజుల్లో అనుమతి ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ పదేళ్లుగా జిల్లాలోని రోడ్లు అధ్వానంగా మారాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రోడ్ల మరమ్మతులకు అదనపు నిధులు మంజూరు చేయాలని డీఈ ఇందిర మంత్రిని కోరారు.