సుష్మాస్వరాజ్ వ్యాఖ్యలు సరికాదు
Published Tue, Oct 1 2013 2:25 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
భీమవరం అర్బన్, న్యూస్‌లైన్: ఇటీవల పాలమూరులో జరిగిన సభలో సీమాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా బీజేపీ జాతీయ నాయకురాలు సుష్మాస్వరాజ్ వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. భీమవరంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ సుష్మాస్వరాజ్ ఏకపక్షంగా మాట్లాడడం సరికాదని అన్నారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ప్రాంతం ఏవిధంగా నష్టపోతుందో ఈనెల 2, 3 తేదీల్లో ఢిల్లీ నాయకులకు వివరిస్తామని చెప్పారు. ఇందుకు అద్వానీ, రాజ్‌నాథ్‌సింగ్, సుష్మాస్వరాజ్‌ల అపాయింట్‌మెంట్ తీసుకున్నట్టు తెలిపారు. రాష్ట్రం విడిపోవడం అనివార్యమైతే హైదరాబాద్ పరిస్థితి, ఆదాయ, వ్యయాలు, జల వనరులు తదితర సమస్యలపై పూర్తి స్థాయిలో ఆలోచన చేయాలని, అప్పుడే కేంద్రానికి విభజనపై మద్దతునివ్వాలని చెబుతామన్నారు. సీమాంధ్రలోని 13 జిల్లాల పార్టీ అధ్యక్షులతో పాటు రాష్ట్ర నాయకులు ఢిల్లీ వెళుతున్నట్టు ఆయన తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకుడు పాకా వెంకట సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు అరసవల్లి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
Advertisement