తల్లీ, కూతుళ్లు
అనుమనాస్పద మృతి
హత్యేనని మృతురాలి
తల్లిదండ్రుల ఆరోపణ, పోలీసులకు ఫిర్యాదు
కష్టమే వచ్చిందో.. కడతేర్చారో తెలియదుగాని తల్లీ, కూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఉరిపోసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారో, ఎవరో చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూశారో తెలియదుగాని శవాలై చెట్టుకు వేలాడారు. ఈ విషాద ఘటన కొత్తూరు మండలంలోని కర్లెమ్మ పంచాయతీ పరిధిలో ఆదివారం వెలుగు చూసింది.
కొత్తూరు: కర్లెమ్మ పంచాయతీ పరిధిలోని ఎన్‌ఎన్ కాలనీలో ఉంటున్న అగ్నిమాపకశాఖ మాజీ ఉద్యోగి పి.సుందరనారాయణ తన మొదటి భార్య చనిపోవడంతో ఒడిశా రాష్ట్రంలోని జీబ గ్రామానికి చెందిన సరోజినిని (35) ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి రెండో తరగతి చదువుతున్న సంజినీ (7) కుమార్తె ఉంది. శనివారం సాయంత్రం ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య వివాదం తలెత్తింది. దీంతో మనస్తాపానికి గురైన సరోజిని కుమార్తె సంజినీ తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై సరోజిని కన్నవారింటికి ఫోన్లు చేయగా రాలేదని సమాధానం వచ్చింది.
ఈ క్రమంలోనే ఇంటి నుంచి వెళ్లిపోయిన తల్లీ, కుమార్తె కర్లెమ్మ గ్రామ సమీపంలో మామిడితోటలోని ఓ చెట్టుకు చీర కొంగుతో ఉరిపోసుకొని వేలాడుతూ శవాలై ఆదివారం ఉదయం కనిపించారు. చీరను రెండు ముక్కలు చేసి ఒక కొంగుతో సరోజిని, మరో కొంగుతో చిన్నారి సంజినీ వేర్వేరు చెట్లకు ఉరిపోసుకొని ఉండటాన్ని స్థానికులు కనుగొన్నారు. సంజినీ మృతదేహం నేలకు తాకుతూ ఉంది. కిందని బిస్కెట్ ప్యాకెట్, తల్లీ కుమార్తె చెప్పులు ఉన్నాయి. విషయాన్ని వీఆర్వో కృష్ణచంద్ర పట్నాయక్‌కు తెలియజేశారు. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇన్‌చార్జి ఎస్సై రామకృష్ణ , ఆర్‌ఐ వై.కూర్మనాయుకులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సుందరనారాయణ, అతని మొదటి భార్య కుమార్తెలే తన కుమార్తె సరోజిని, మనమరాలు సంజినీ హత్య చేసి చెట్టుకు వేలాడదీసేశారని అనుమానం వ్యక్తం చేస్తూ సరోజిని తండ్రి దుర్జన కొత్తూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు ఇన్‌చార్జి ఎస్సై కె.రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఎన్నో అనుమానాలు!
తల్లీ, కూతురు మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరోజిని తెలియని, నిర్మానుష్యంగా ఉన్న తోటలోకి వచ్చి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి లేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితిలో తల్లీ, బిడ్డలను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు శవాలను మామిడి తోటలోకి తీసుకొచ్చి చెట్లకు వేలాడిదీసి ఉంటారనే ఆనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుందరనారాయణ, ఆయన మొదటి భార్య కుమార్తెలు కలిసి తల్లీ కూతురును నిత్యం వేధిస్తుండేవారని, కన్నవారి ఇంటికి వెళ్లిపోవాలని ఒత్తిడి చేయడంతోపాటు సూటిపోటు మాటలతో ఇబ్బందులకు గురి చేయడంతో పలుమార్లు విషయాన్ని సరోజని తన తండ్రి దుర్జనకు తెలిపినట్లు సమాచారం. కాగా సరోజిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సుందరనారాయణ, అతని తొలి భార్య కుమార్తెలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సరోజని కూతురుతో కలసి ఇంటి నుంచి వచ్చిన గంట ముందు లెట్రిన్ ట్యాంకు విషయమై కుటుంబ సభ్యులతో వివాదం జరిగినట్టు సమాచారం. కాగా సరోజని, కుమార్తెలతో కలిసి సుందరనారాయణ ఇటీవల వారం రోజుల పాటు తీర్థయాత్రలకు వెళ్లి.. రాజమండ్రి పుష్కర స్నానాలు ఆచరించి ఈ నెల 14 తేదీ రాత్రే ఇంటికి చేరారు. ఇంతలోనే ఈ ఘోరం జరగడంతో గ్రామస్తులు తీవ్ర విషాదానికి గురయ్యారు.
కష్టమే వచ్చిందో..కడతేర్చారో?
Published Sun, Jul 19 2015 11:43 PM | Last Updated on Tue, Nov 6 2018 8:51 PM
Advertisement
Advertisement