తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. గురువారం రాత్రి పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చించినప్పటికీ, చర్చలు కొలిక్కి రాకపోవడంతో సారథి ఖరారు శుక్రవారానికి వాయిదా పడింది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. గురువారం రాత్రి పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చించినప్పటికీ, చర్చలు కొలిక్కి రాకపోవడంతో సారథి ఖరారు శుక్రవారానికి వాయిదా పడింది. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన పి.మహేందర్‌రెడ్డి ఇటీవల టీఆర్‌ఎస్ పంచన చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన ఈ పదవిని భర్తీ చేసే అంశంపై తాజాగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో నియోజకవర్గాల ఇన్‌చార్జిలతో సమావేశం నిర్వహించారు.
అనంతరం రాజ్యసభ సభ్యుడు దేవేందర్‌గౌడ్, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, నగర మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి సుభాష్‌యాదవ్‌తో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అధ్యక్షుడి ఎంపికపై సీనియర్ల అభిప్రాయాలను తెలుసుకున్నారు. గతంలో జిల్లా నాయకత్వ బాధ్యతలు నిర్వహించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సహా సామాజిక సమీకరణలో భాగంగా బీసీ వర్గానికి చెందిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కు అధ్యక్ష పదవి ఇచ్చే అంశంపై చర్చించారు.
ఓ దశలో పార్టీ ప్రధాన కార్యదర్శి సుభాష్‌యాదవ్ పేరు తెరపైకి వచ్చినప్పటికీ, ఎన్నికల వేళ సీనియర్లకు పగ్గాలు అప్పగించడమే శ్రేయస్కరమని అంచనాకొచ్చిన బాబు... ఎమ్మెల్యేలకే పార్టీ పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఇరువురు శాసనసభ్యులకు స్పష్టం చేశారు. ఎవరి సారథ్యంలోనైనా పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, మీరు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చంద్రబాబు దృష్టికి తెచ్చారు.
దీంతో కొత్త అధ్యక్షుడి ఖరారుపై శుక్రవారం తన నిర్ణయం వెల్లడిస్తానని చంద్రబాబు తెలిపినట్లు పార్టీ వర్గాలు వివరించాయి.
సత్తా చాటండి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలని చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. పార్టీ నేతలంతా సమన్వయంతో పనిచేయాలని, సమర్థ అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచించారు. జిల్లాలోని ఐదు పురపాలక సంఘాల్లో పార్టీ పటిష్టంగా ఉందని, సమష్టిగా రాణించడం ద్వారా మెజార్టీ వార్డులు దక్కించుకోవాలని అన్నారు. ఎన్నికల్లేని శివారు ప్రాంతాల్లోని నేతలకు కూడా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పగించాలని జిల్లా నాయకత్వాన్ని ఆయన ఆదేశించారు.