* మావోయిస్టు ప్రాంతంలో సంచలనం
*ఆలస్యంగా వెలుగులోకి
పాడేరు(జి.మాడుగుల) : అనుమానంతో కట్టుకున్న భార్యను అతికిరాతకంగా కత్తితో పొడిచి భర్త హతమార్చిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జి.మాడుగుల మండలంలోని మావోయిస్టు ప్రభావిత బొయితిలి పంచాయతీ దిగరాపల్లిలో సోమవారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. మారుమూల ప్రాంతం కావడం, మంగళవారం సాయంత్రం మృతురాలి సోదరుడు ఏసేబు జి.మాడుగుల పోలీసుకు ఫిర్యాదు చేసే వరకు ఇది వెలుగులోకి రాలేదు.
గ్రామానికి చెందిన బట్టి సత్యారావు(40) భార్యపై అనుమానంతో తరచూ తగాదా పడేవాడు. పలుమార్లు గ్రామ పెద్దలు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చినప్పటికి ఫలితం లేకపోయింది. సోమవారం సాయంత్రం భార్య బట్టి ముత్యమ్మ(34)తో ఘర్షణ పడిన సత్యారావు ఇంటిలో ఉన్న కత్తిని తీసుకొని ఆమె ఛాతి భాగంలో పొడిచాడు. అక్కడికక్కడే మృతి చెందింది. నిందితుడు పరారయ్యాడు. మృతురాలి సోదరుడు ఏసేబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఎస్‌ఐ శేఖరం కేసు నమోదు చేశారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం కావడంతో పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లలేకపోయారు. బుధవారం ఉదయాన్నే పోలీసు బలగాలతో సంఘటన స్థలానికి వెళతామని ఎస్‌ఐ తెలిపారు.
అనుమానంతో భార్యను కడతేర్చాడు
Published Wed, Dec 31 2014 5:35 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM
Advertisement
Advertisement