గుండ్రాతిమడుగు(కురవి), న్యూస్‌లైన్ : వ్యవసాయ బావి ఇద్దరిని మింగింది. ప్రమాదవశాత్తూ బావిలో ఇద్దరు చిన్నారులు పడిపోగా వారిని రక్షించేందుకు ఓ యువకుడు అందులోకి దిగాడు. ఇద్దరు చిన్నారుల్లో ఒకరిని ఒడ్డుకు చేర్చిన అతడు మరో చిన్నారి కోసం నీళ్లలోకి వెళ్లాడు. నీళ్లలో మునిగిపోతున్న ఆ బాలిక భయంతో అతడిని గట్టిగా పట్టుకోవడంతో ఊపిరాడక ఇద్దరూ ప్రాణాలొదిలారు. మండలంలోని గుండ్రాతిమడుగు(విలేజి) శివారు పెద్దతండా స్టేజీ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.
గుండ్రాతిమడుగు(విలేజి) శివారు పెద్దతండా స్టేజీ వద్ద నాగార్జున పెంకు ఫ్యాక్టరీలో తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాలకు చెందిన వలసకూలీలు పనిచేస్తున్నారు. పెంకు ఫ్యాక్టరీ వెనుక కొంతదూరంలో వ్యవసాయ బావి ఉంది. కూలీల పిల్లలు వ్యవసాయబావి వద్దకు సాయంత్రం ఆడుకునేందుకు వెళ్లారు. కొందరు పిల్లలు బావిలోకి దిగి ఈత కొడుతుండగా, గోపి అమ్మాజీ, రమణ దంపతుల కుమార్తె మేరీ(7), మరో బాలుడు మేళిక కిషోర్‌తోపాటు మరికొందరు వారిని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తూ కాలుజారడంతో మేరి, కిషోర్ బావిలో పడిపోయారు.
ఇది గమనించి బావి పక్కనే ఉన్న మరికొందరు పిల్లలు ఏడుస్తూ ఫ్యాక్టరీ వైపు పరుగులు తీశారు. ఫ్యాక్టరీ ఆవరణలో కట్టెలు కొడుతున్న నిమ్మక దుర్గాప్రసాద్(22)కు విషయం చెప్పడంతో అతడు పరుగున వెళ్లి బావిలోకి దిగాడు. మునుగుతూ తేలుతున్న కిషోర్‌కు చేయి అందించి ఒడ్డుకు చేర్చాడు. ఆ తర్వాత ఆతృతలో తనకు ఈత రాని విషయూన్ని మరిచిపోయి నీళ్లలో మునిగిపోతున్న మేరీని రక్షించేందుకు ముందుకు వెళ్లాడు. అయితే అప్పటికే భయం తో ఉన్న మేరి అతడిని గట్టిగా పట్టుకుంది. అప్పటికే ఆల స్యం కావడం, మేరీ అతడిని విడవకపోవడంతో ఊపిరాడక ఇద్దరు కలిసే ప్రాణాలు వదిలారు. ఈలోపు అక్కడికి చేరుకున్న కూలీలు వారి మృతదేహాలను ఫ్యాక్టరీలో బయటకు తీసి, ఎస్సై ఎండీ మస్తాన్‌మియాకు సమాచారం అందించా రు. ఆయన సంఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మానుకోట ఆస్పత్రికి తరలించారు.
పెంకు ఫ్యాక్టరీలో విషాదం..
విజయనగరం జిల్లా కొమరాడ మండలంలోని నాయుడువలస గ్రామానికి చెందిన నిమ్మక దుర్గాప్రసాద్,చుక్క దంపతులు ఐదేళ్ల క్రితం ఇక్కడికి వలస వచ్చారు. వారికి ఏడు నెలల పసిపాప ఉంది. మరో మృతురాలు మేరీ తల్లిదండ్రులు గోపి అమ్మాజీ, రమణ దంపతులు తూర్పుగోదావరి జిల్లా కిర్లపూడి మండలంలోని సింహాద్రిపురం నుంచి 18 సంవత్సరాల క్రితం వలస వచ్చారు. ఇక్కడే ఫ్యాక్టరీలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారితోపాటు ఆ ప్రాంతానికి చెందిన సుమారు మరో 40 కుటుంబాలు ఫ్యాక్టరీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాయి. బతుకుదెరువు కోసం వచ్చిన ఆ కుటుంబాల్లో దుర్గాప్రసాద్, మేరీల మృతి పెను విషాదం నింపింది. కార్మికుల రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.
ఇద్దరిని మింగిన వ్యవసాయ బావి
Published Mon, Dec 16 2013 3:40 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement