పోలీస్‌ ‘ఫోర్స్‌’ @ ప్రకాశం ! | SWAt Team Established In Ongole | Sakshi
Sakshi News home page

పోలీస్‌ ‘ఫోర్స్‌’ @ ప్రకాశం !

Published Thu, Oct 3 2019 12:22 PM | Last Updated on Thu, Oct 3 2019 12:22 PM

SWAt Team Established In Ongole - Sakshi

స్వాట్‌ బృందం 

సాక్షి , ఒంగోలు : ప్రకాశం జిల్లాలో సరికొత్త సమర్ధవంతమైన పోలీస్‌ ‘ఫోర్స్‌’ తయారైంది. జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ స్పెషల్‌ వెపన్‌ అండ్‌ టాక్టిక్స్‌ (స్వాట్‌) పేరుతో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. తీవ్రవాదులు, అసాంఘిక శక్తుల ఆట కట్టించేందుకు స్వాట్‌ బృందం అన్ని విభాగాల్లో కఠిన శిక్షణ పొందేలా చర్యలు తీసుకున్నారు. అనుకోని ఘటన జరిగితే సమర్ధవంతంగా ఎదుర్కొని వీఐపీలు, ప్రజల ప్రాణాలను రక్షించేందుకు వీలుగా ఈ బృందాన్ని తయారు చేశారు.  తీవ్రవాదం రాజధాని ప్రాంతాలు, మహా నగరాలకే పరిమితం కాకుండా చాపకింద నీరులా పట్టణాలు, పల్లెలకు వ్యాపించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో వాటిని దీటుగా ఎదుర్కొనేందుకు జిల్లా స్థాయిలో ఓ పోలీస్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలన్న తలంపు ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌కు వచ్చింది. ఎన్‌.ఎస్‌.జి, ఆక్టోపస్, గ్రైహౌండ్స్‌ వంటి ఒక శక్తివంతమైన సంస్థను నెలకొల్పాలనే లక్ష్యంతో పోలీస్‌ శాఖలో ఉండే మెరికల్లాంటి సిబ్బందిని ఎంపిక చేసి వారికి కఠిన శిక్షణ ఇప్పించారు. శిక్షణ పూర్తయిన స్వాట్‌ బృందాన్ని గురువారం డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అధికారికంగా ప్రారంభించనున్నారు. అనంతరం పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో వీఐపీలు, ఉన్నతాధికారులు, నగర ప్రజల సమక్షంలో స్వాట్‌ బృందం డెమో ప్రదర్శన చేయనుంది. అన్ని విభాగాల్లో సరికొత్త విధానాన్ని కనిపెట్టి జిల్లా పోలీస్‌ శాఖను సమర్ధవంతంగా నడుపుతున్న ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ను అంతా అభినందిస్తున్నారు.

స్వాట్‌ అంటే...
తీవ్రవాదులను మట్టుపెట్టేందుకు ఏర్పాటుచేసే శక్తివంతమైన విభాగం అని స్వాట్‌ శిక్షణ చూసిన వారికి  అర్థమవుతుంది.  స్వాట్‌ టీం శిక్షణ అంటే మెరికల్లాంటి కమెండోలను తయారుచేసుకోవడం,  జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ మెరికల్లాంటి ఆర్మ్‌డ్‌ రిజర్వు సిబ్బందిని ఎంపికచేసి వారికి ఈ శిక్షణ ఇప్పించారు. మన దేశంలో పంజాబ్, చంఢీఘర్, బెంగళూరు సిటీ, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో మాత్రమే ఉన్న స్వాట్‌ టీమ్‌లు మన రాష్ట్రంలో మొట్ట మొదటిసారిగా ప్రకాశం జిల్లాలో ఏర్పాటు కావడం విశేషం. స్వాట్‌ టీంలోని సభ్యులకు అత్యంత అధునాతనమైన ఆధాయులపై శిక్షణ ఇవ్వడమే కాకుండా గంటల తరబడి ఒకే ప్రదేశంలో ఒకే పొజిషన్‌లో వేచి ఉండేలా సైతం శిక్షణ ఇచ్చారు. వారి కదలికలు, వారి హావభావాలు సైనిక శిక్షణను తలపించే రీతిలో ఉందంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే కేవలం రూ.2,100లతో జిల్లాలోని మారుమూల పోలీసుస్టేషన్లను సైతం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అనుసంధానం చేయడంతోపాటు, ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా కూడా స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకున్న సిద్ధార్థ కౌశల్‌కు స్వాట్‌ బృందం ఏర్పాటు మరింత పేరు తెచ్చింది.  

ఎన్‌.ఎస్‌.జీ, ఆక్టోపస్‌ ఇన్‌స్ట్రక్టర్‌లతో కఠిన శిక్షణ: 
దాదాపు 60 మందితో కూడిన స్వాట్‌ సభ్యుల శిక్షణ కార్యక్రమాన్ని ఎస్పీ జిల్లా పోలీసు పరేడ్‌గ్రౌండులో ప్రతి రోజూ నిర్వహిస్తూనే ఉన్నారు.  600కుపైగా భారీ వాహనాలకు వినియోగించే టైర్లతో ఒక డెన్‌ను తయారు చేశారు. ప్రజలు చూస్తున్నంతసేపు వారి కళ్ల ముందు ముంబైలోని తాజ్‌ హోటల్‌లో జరిగిన దుర్ఘటన గుర్తుకు తెచ్చేలా శిక్షణ సాగుతుంది. ఒక పెద్ద భవనాన్ని తీవ్రవాదులు స్వాధీనం చేసుకుని తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేస్తూ లోపల ఉన్న పౌరుల్ని హింసిస్తుంటే, వారి ఆట కట్టించేందుకు ప్రకాశం స్వాట్‌ టీం రంగంలోకి దిగింది. అధునాతమైన ఆయుధాలతో మూడు బృందాలుగా విడిపోయి శత్రువులు స్వాధీనం చేసుకున్న స్థావరంలోకి ప్రవేశించడం ఉత్కంఠగా మారింది. డోర్లను సైతం కేవలం చిన్నపాటి బాంబులతో పేల్చివేసి శత్రువులను అదుపులోకి తీసుకుని వారిని నిర్వీర్యులను చేయడం, పారిపోయిన తీవ్రవాదులను పోలీస్‌డాగ్‌ సాయంతో గుర్తించడం వంటివి ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా స్వాట్‌టీం సిబ్బంది వీఐపీని కిడ్నాప్‌ చేసిన వారిని (వెహికల్‌ అసాల్ట్‌), ఒక బస్సును సైతం కిడ్నాపర్లు అదుపులోకి తీసుకుంటే (బస్‌ అసాల్ట్‌) వారిని సురక్షితంగా రక్షించడం వంటివి చూస్తే నిజంగానే జరిగిందా అన్నట్లు ప్రదర్శన సాగింది. దాదాపు అయిదు వాహనాల ఛేజింగ్, కారు అద్దాలను సైతం బాంబుతో పేల్చివేసి క్షణాలలో కారులో ఉన్న కిడ్నాపరును నిర్వీర్యం చేయడం ఆసక్తి గొలిపే అంశాలు. పోలీస్‌ జాగిలం సైతం బ్యారికేడ్ల మీదుగా జంప్, మండుతున్న వలయాల గుండా జంప్‌ చేయడం చూపరులకు అబ్బుర పరిచింది. మరో వైపు పోలీసులు అధునాతన ఆయుధాలను వారి ముందు ఉంచి వారి కళ్లకు గంతలు కడితే ఏమాత్రం తొట్రుపడకుండా వాటిని వేగంగా ఊడదీసి వాటిని తిరిగి అమర్చడం (బ్లైండ్‌ ఫోల్డ్‌)లో కూడా శిక్షణ ఇచ్చారు. వీరికి స్పెషల్‌ వెపన్స్‌తో టాక్టికల్‌ ఫైరింగ్‌ ఎంపీ–5 (సార్ట్‌ రేంజ్‌ వెపన్‌), గ్లాక్, ఎ.కె–47, స్నిపర్, స్టన్‌ గ్రనైడ్‌ వంటి ఆయుధాల్లో నిష్ణాతులయ్యేలా శిక్షణ ఇచ్చారు. ఆపరేషన్స్‌ సమయంలో ఉపయోగించాల్సిన కమ్యూనికేషన్స్‌ విధానాన్ని నేర్పించారు. హౌస్‌ ఇంటర్‌వెన్షన్‌లో టెక్నిక్స్, కార్డన్‌ అండ్‌ సెర్చ్‌లో మెళకువలు నేర్పించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement