సాక్షి, కడప : స్వైన్‌ఫ్లూ సోకి హైదరాబాదులో రెండు రోజుల క్రితం ముగ్గురు మృతి చెందడంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. హైదరాబాదు నుంచి వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేయడంతో జిల్లా అంతటా వైద్యాధికారులు అలర్ట్ అయ్యూరు. స్వైన్‌ఫ్లూ లక్షణాలతో కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ఏఎన్‌ఎంలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటికే జిల్లాకు చేరిన మందులు
జిల్లాకు స్వైన్ ఫ్లూకు సంబంధించిన మందులు ఇది వరకే చేరాయి. హైదరాబాదు నుంచి చిన్నారులు, పురుషులు, మహిళలకు సంబంధించిన మందులు జిల్లాకు వచ్చినట్లు సంబంధిత అధికారుల ద్వారా తెలియవచ్చింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అవసరమైతే ప్రత్యేక వార్డులను కూడా కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నారు.
2008-09లో నాలుగు కేసులు
జిల్లాలో 2008-09 ప్రాంతంలో నాలుగు కేసులు నమోదయ్యాయి. అప్పట్లో స్వైన్‌ఫ్లూ నలుగురికి సోకడంతో రిమ్స్‌లోని టీబీ వార్డుకు సమీపంలోనే ప్రత్యేకంగా ఒక వార్డును కూడా ఏర్పాటు చేశారు. అప్పట్లో స్వైన్‌ఫ్లూ నలుగురికి సోకినా అందరూ మళ్లీ కోలుకున్నారు. అయితే 2009 తర్వాత నుంచి ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రిమ్స్‌లోని స్వైన్‌ఫ్లూ వార్డును కూడా సాధారణ వార్డుగా మార్చేశారు.
స్వైన్‌ఫ్లూ లక్షణాలు
జలుబు ఎక్కువగా ఉండడంతోపాటు దగ్గు, తలనొప్పి, గొంతులో గరగర, చలి, అలసట ఉండడం....విరేచనాలు, వాంతులతో నిమోనియా తరహాలో ఉంటుంది.
గర్భిణీ స్త్రీలలో వేగంగా వ్యాప్తి చెందుతుంది.
అస్తమా, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ ఉన్న వాళ్లకు కూడా త్వరగా వైరస్ వ్యాప్తి చెందుతుంది. గుండె సంబంధిత వ్యాధులున్న వారు, చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వారు, చిన్నపిల్లలకు కూడా సోకే ప్రమాదముంది.
నివారణ
చేతులు తరుచూ సబ్బుతో శుభ్రపరుచుకోవాలి. నీరు ఎక్కువగా తాగడం.... సరిపడా నిద్ర.... రోగ నిరోధక శక్తి పెంపునకు మంచి పౌష్ఠికాహారం తీసుకోవాలి. కిటికీ, గదులకు సంబంధించి తలుపులు మూసి ఉంచుకోవాలి. తుమ్మినా, దగ్గినా, ఆవులించినపుడు చేయి లేదా చేతి రుమాలు అడ్డుపెట్టుకోవడం చేయాలి. ఇలాంటి లక్షణాలు కనబడితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
స్వైన్‌ఫ్లూ కలకలం
Published Fri, Dec 19 2014 3:48 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement